
దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడిపై కేసు
మదనపల్లె రూరల్ : సొంత పార్టీ కార్యకర్త, అనుచరుడిపై తంబళ్లపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు సీడ్ మల్లికార్జున నాయుడు, కుమారుడు శశిధర నాయుడుతో కలిసి దాడి చేసిన ఘటనపై శుక్రవారం రాత్రి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కురవంక హోసన్నా చర్చి సమీపంలో నివసిస్తున్న చంద్రమోహన్ కుమారుడు సి.అనిల్‌కుమార్ చాలా కాలంగా టీడీపీ నాయకుడు సీడ్ మల్లికార్జున ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. ఆరునెలల క్రితం అనిల్‌కుమార్, సీడ్ మల్లికార్జున నాయుడు వెంట తిరగడం వదిలేసి, మరో నాయకుడైన కట్టా దొరస్వామినాయుడు వద్దకు చేరాడు. కొద్దిరోజుల క్రితం కట్టా దొరస్వామినాయుడు జన్మదినం సందర్భంగా బ్యానర్లు ఏర్పాటు చేశాడు. తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా వాట్సప్‌లో పోస్ట్ పెట్టాడు. విషయం తెలుసుకున్న సీడ్ మల్లికార్జున నాయుడు, ఈనెల 10వతేదీ ఉదయం 6.30 గంటలకు కుమారుడు శశిధరనాయుడు, డ్రైవర్ రాజేష్‌తో కలిసి అనిల్‌కుమార్ ఇంటికి వెళ్లాడు. అనిల్ భార్య గీత చూస్తుండగా, సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడతావా అని పిడిగుద్దులు గుద్దుతూ, చేతులతో కొడుతూ, కాలితో తన్నుతూ బీభత్సం సృష్టించారు. ఈ తతంగాన్ని డ్రైవర్ రాజేష్ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. తాను పోస్ట్ పెట్టలేదని ప్రాధేయపడుతున్నా వినిపించుకోకపోగా, కాళ్లతో తన్నుతూ తాము దాడి చేసిన విషయం ఎవరికై నా చెబితే అంతుచూస్తామని బెదిరించారు. తర్వాత ఈనెల 20వ తేదీన సోషల్ మీడియాలో సీడ్ మల్లికార్జుననాయుడు వీడియోను పోస్ట్ చేశారు. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, అనిల్ తనకు జరిగిన అవమానంపై, శుక్రవారం రాత్రి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీడ్ మల్లికార్జున నాయుడు, శశిధర నాయుడుపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎరీషావలి తెలిపారు.