
వీఆర్‌ఓ కృష్ణప్ప సస్పెన్షన్
లక్కిరెడ్డిపల్లి: లక్కిరెడ్డిపల్లి టౌన్‌కు సంబంధించిన వీఆర్‌ఓ కృష్ణప్పను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి ఉత్తర్వులు జారీ చేశారు.టౌన్ పరిధిలోని సర్వే నంబరు 705/2లోని రెండు ఎకరాల డీకేటీ భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి ఆన్‌లైన్‌లో నమాదు చేశారని పట్టణానికి చెందిన సాయిలీల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు వీఆర్‌ఓను విధుల నుంచి తొలగించినట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
25న ప్రవేశ పరీక్ష
కడప రూరల్: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ఈనెల 25న పరీక్షలు నిర్వహించనున్నట్లు కడప చిన్నచౌక్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎల్.మాధవీలత తెలిపారు. వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతిలో మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తులను ఈనెల 23 వరకు స్వీకరిస్తామని తెలిపారు. 25వ తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షను కడప చిన్న చౌక్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తామని వివరించారు.
నేడు రగ్బీ జట్టు ఎంపిక
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఉమ్మడి కడప జిల్లాలో ఆదివారం జూనియర్ బాల బాలికల రగ్బీ జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు రగ్బీ అసోసియేషన్ సెక్రటరీ వి. ధన నారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28–29న 18 ఇయర్స్ కేటగిరి కి సంబంధించిన బాల బాలికల రగ్బీ ఇంటర్ జిల్లాల టోర్నమెంట్ కర్నూలులో జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా జట్టు కోసం ఎంపికలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఎంపికలు కడప మునిసిపల్ స్టేడియంలో జరుగుతాయన్నారు. వివరాలకు 8297059998ను సంప్రదించాలని సూచించారు.
నమో నారసింహ
గుర్రంకొండ: మండలంలోని గుర్రంకొండ, తరిగొండ గ్రామాల్లో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. శనివారం టీటీడీ వారి ఆధ్వర్యంలో తరిగొండ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యోగినీ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని వేకువజామునే స్వామివారికి పలు రకాల నైవేద్యాలు సమర్పించారు. అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తోమాల సేవ, ఏకాంతసేవ కావించారు. ఈసందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు.భక్తులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్నారు. నమో నారసింహ...కాపాడు తండ్రి అని వేడుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

వీఆర్‌ఓ కృష్ణప్ప సస్పెన్షన్