
మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
రైల్వేకోడూరు అర్బన్ : అన్నమయ్య జిల్లాలో మామిడి రైతులకు కల్గిన ఇబ్బందులు ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలు పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటోందని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ పేర్కొన్నారు. ఆయన శనివారం ఆకస్మికంగా రైల్వేకోడూరులో పర్యటించి మామిడి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో రైతులు, వ్యాపారులతో మాట్లాడి అనంతరం శెట్టిగుంటలోని జ్యూస్ ఫ్యాక్టరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేకోడూరు, రాజంపేట పరిధిలో 2630 హెక్టార్లలో తోతాపూరి మామిడి రకాన్ని రైతులు సాగు చేస్తున్నారని, వీటిలో 22 వేల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందన్నారు. కచ్చితంగా ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన కేజీకి రూ. 4లు సబ్సిడీ అందిస్తామని పేర్కొన్నారు. అలాగే ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని బట్టి రైతులు మామిడి కాయలు కోసి అందించాలన్నారు. ఏ ఒక్క రైతుకు నష్టం వాటిల్లకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారిణి సుభాషిణి, తహసీల్దార్ అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు.