
ట్రాక్టర్‌ను ఢీ కొన్న కంటైనర్
ఒంటిమిట్ట : మండల పరిధిలోని మంటపంపల్లి గ్రామ సమీపంలో కడప–చైన్నె జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను కంటైనర్ ఢీకొంది. పోలీసుల వివరాల మేరకు శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు చైన్నె నుంచి కడప వైపు వెళ్తున్న కంటైనర్ మంటపంపల్లి సమీపంలోకి రాగానే రాజంపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టి బోల్తాపడింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాలేదు. అయితే కంటైనర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
రెండు బైక్‌లు ఢీ కొని యువకుడి మృతి
మైదుకూరు : రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైదుకూరు మండలం చెర్లోపల్లె సమీపంలో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చింతకొమ్మదిన్నె మండలం లక్కిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దొడ్డి పద్మావతి తన కుమారుడు గంగాధర్ (20)తో కలసి చెర్లోపల్లెలో ఉన్న ఆమె చెల్లెలు గుర్రమ్మ ఇంటికి వచ్చింది. అక్కడి నుంచి చాపాడు మండలం నాగులపల్లె గ్రామంలో గుర్రమ్మ కుమార్తె సీమంతానికి హాజరయ్యేందుకు మోటార్ బైక్‌పై తల్లి కొడుకు బయల్దేరారు. చెర్లోపల్లె సమీపంలో వీరి బైక్ ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న గంగాధర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుని తల్లి పద్మావతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై మైదుకూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
వల్లూరు : కడప – తాడిపత్రి ప్రధాన రహదారిలో విమానాశ్రయం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వల్లూరు మండల పరిధిలోని పుల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన బి.భాస్కర్ రెడ్డి (38) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు పుల్లారెడ్డిపేటకు చెందిన భాస్కర్ రెడ్డి భార్య చెవి సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకుని కడపలోని ఓ ఆసుపత్రిలో ఉన్నారు. భార్య వద్దకు వెళ్లేందుకు భాస్కర్‌రెడ్డి తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంలో కడపకు బయలు దేరాడు. విమానాశ్రయం సమీపంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి వస్తున్న సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో కిందపడ్డ భాస్కర్‌రెడ్డిపై ట్యాంకర్ ఎక్కడంతో అతని శరీరం ఛిద్రంగా మారి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమారుడు ప్రణీత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాలుడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు తిరుపతికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శాటిలైట్ రంగంపై అవగాహన అవసరం
చాపాడు : విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు శాటిలైట్ రంగంపై అవగాహన కలిగి ఉండాలని, ఇందుకోసం ఆయా పాఠశాలలు చర్యలు తీసుకోవాలని ఇస్రో ప్రాజెక్టు మాజీ డైరెక్టర్, సీనియర్ సైంటిస్ట్ టీకే సుందరమూర్తి పేర్కొన్నారు. స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్పేస్ ల్యాబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ఆయన ముందు చూపునకు నిదర్శనమన్నారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ వి.జయచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే జ్ఞానం పొందలేరని ప్రయోగశాల ద్వారా నేర్చుకున్న విద్య ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వి.లోహిత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ బి.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్‌ను ఢీ కొన్న కంటైనర్

ట్రాక్టర్‌ను ఢీ కొన్న కంటైనర్