
కూటమి ప్రభుత్వంలో యువతకు అన్యాయం
కడప అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం యువతతో పాటు, విద్యార్థులకు సకాలంలో పథకాలను వర్తింపచేయకుండా దగా చేస్తోందని, ఈ విధానానికి వ్యతిరేకంగా ఈనెల 23న కడపలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం నుంచి ‘యువతపోరు’ పేరుతో ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరి కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోసం శనివారం కడపలోని జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే యువతతోపాటు, రైతులకు, మహిళలకు అన్ని వర్గాలకు మోసం చేసిందన్నారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని, లేదంటే ప్రతినెలా రూ. 3000 నిరుద్యోగ భృతిని అందజేస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకే ‘యువతపోరు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ‘అమ్మ ఒడి’ పథకానికి ‘తల్లికి వందనం’ అనే పేరు మార్చి ఏడాది తరువాత ఇటీవల ఎంతమంది తల్లుల బ్యాంకు ఖాతాలలో రూ. 15000 చొప్పున వేశారో అంచనాకు రాలేదన్నారు. ఎవరెవరికి, ఏయే షరతులను విధించి ఆ పథకానికి దూరం చేశారో తేలాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతమంది విద్యార్థులకు వర్తింపచేశారో కూడా తెలియాల్సి ఉందన్నారు. గత ఏడాది కాలం నుంచి ఫీజు రీ యింబర్స్‌మెంట్‌లో భాగంగా విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు వర్తింపచేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అధికారంలోకి రాకమునుపు తల్లికి వందనం ఎలాంటి షరతులు లేకుండా అందరికి వర్తింపజేస్తామని, ఎంతమంది పిల్లలుంటే వారందరికి పథకం వర్తింపజేస్తామని ‘బాబు ష్యూరిటీ’ పేరుతో హామీలను ఇచ్చారని, సూపర్ సిక్స్‌లో ఏ పథకం సక్రమంగా అమలు చేయకపోయినా ‘చొక్కా పట్టుకుని నిలదీయండి’ అని చెప్పారన్నారు. తల్లికి వందనం, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన, విద్యాకానుక లాంటి పథకాలను చంద్రబాబు అమలు చేయకపోవడంతో 13 నెలల్లోనే దాదాపు రూ.22వేల కోట్లు లబ్ధిదారులకు బకాయిలు పడ్డారన్నారు. ఈ పథకాలను అమలు చేసేంత వరకు తాము పోరాడుతూనే ఉంటామన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షఫీవుల్లా, నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు శివారెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి
ఈనెల 23న యువత పోరు ర్యాలీ
అనుమతి కోసం జిల్లా ఎస్పీకి వినతిపత్రం