
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
కమలాపురం : పట్టణంలోని తెలుగు వీధికి చెందిన హరీష్ కుమార్ (26) రైలు కింద పడి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. పట్టణానికి చెందిన హరీష్ కుమార్ శుక్రవారం రాత్రి కమలాపురం పట్టణ శివారులోని చెరువు కట్ట వద్ద రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరం రెండు ముక్కలైంది. ట్రాక్ మాన్ సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టమ్ నిమిత్తం రిమ్స్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కువైట్ వెళ్లిన హరీష్ మూడు మాసాల క్రితం కమలాపురం వచ్చాడని, మృతి గల కారణాలు తెలియరావాల్సి ఉందని వారు తెలిపారు.
లారీ డ్రైవర్‌కు జైలుశిక్ష
వల్లూరు(చెన్నూరు) : మద్యం సేవించి లారీ నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష, రూ 2,500 జరిమానా విధిస్తూ కడప ఫస్ట్ స్పెషల్ జేఎస్‌సీఎమ్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పినట్లు చెన్నూరు సీఐ క్రిష్ణారెడ్డి తెలిపారు. మండలంలో గురువారం పోలీసులు బ్రీత్ అనలైజర్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. వేల్పూర్ల రామకృష్ణ మద్యం తాగి లారీ నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా నేరం రుజువు కావడంతో కడప ఫస్ట్ స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మేజిస్ట్రేట్ మంగళ గౌరీ జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు.
ఏపీజీబీ కార్యాలయంపై సోలార్ యూనిట్
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప ఏపీజీబీ హెడ్ ఆఫీస్ అనెక్స్ భవనంపై 100 కిలోవాట్ల ఆన్‌గ్రిడ్ రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను ప్రారంభించామని ఆ బ్యాంకు చైర్మన్ కె.ప్రమోద్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సోలార్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కార్యక్రమం కింద రూ.52 లక్షల ఖర్చులతో 100 కిలోవాట్ల ఆన్ గ్రిడ్ రూఫ్ టాప్ సోలార్ యూనిట్ ప్రారంభించామన్నారు. అలాగే అనంతపురం ప్రాంతీయ కార్యాలయంలో రూ.14 లక్షలతో 25 కిలోవాట్ల ఆన్‌గ్రిడ్ స్టిమ్, 29 బ్రాంచ్‌లలో 89 కిలో వాట్ల సామర్థ్యంగల ఆఫ్ గ్రిడ్ సిస్టమ్‌లను ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ అరుణకుమార్, జీఎంలు హర్‌కేశ్వర్ ప్రసాద్, పవన్‌కుమార్‌సింగ్, కడప ప్రాంతీయ మేనేజర్ శ్రీనివాసప్రసాద్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య