
ఎనిమిది గంటల పనిదినాల పెంపుపై నిరసన
రాయచోటి : ఎనిమిది గంటలపాటు పనిచేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కార్మికులకు నిరసన తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ శానిటేషన్, ఇంజినీరింగ్ సిబ్బంది మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బీవీ.రమణ మాట్లాడుతూ ఎనిమిది గంటల ఆరోగ్యం, ఎనిమిది గంటల నిద్ర ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు లెక్కచేయకుండా కార్పోరేట్ల జేబు నింపడానికి కార్మికులు, కూలీల శ్రమ దోచిపెట్టడం తగదన్నారు. మున్సిపల్ కార్మికులకు తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని, పారిశుద్ధ్య వాహన డ్రైవర్లకు రూ.24,500 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో జూన్ 23వ తేదీ నుంచి సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, అక్బర్, శంకరయ్య, రమణ, చెన్నయ్య, చంద్రశేఖర్, ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.