కూచిపూడిలో ప్రతిభ
రాయచోటి జగదాంబసెంటర్: కూచిపూడి నృత్య ప్రదర్శనలో రాయచోటికి చెందిన హేమశ్రీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. 2023 డిసెంబర్ 24న హైదరాబాద్‌లో జరిగిన నృత్య ప్రదర్శనలో హేమశ్రీ విశేష ప్రతిభ కనబరిచారు. ఈనెల 13న హైదరాబాద్‌లోని మణికొండలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ట్‌కు సంబంధించిన ప్రశంసాపత్రం అందుకున్నారు. దళిత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కోలాప్రసాద్, జబర్దస్త్ నటుడు హైపర్ ఆదిలు హేమశ్రీకి ప్రశంసాపత్రం అందజేశారు. హేమశ్రీకి పలువురు రాయచోటి అభినందనలు తెలిపారు.
జులై 14 నుంచి బీఈడీ,
ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ, ఎంఈడీ కళాశాలల విద్యార్థుల సెమిస్టర్ పరీక్షలు జూలై 14వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు వైవీయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీఈడీ 2వ సెమిస్టర్, 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ విద్యార్థులకు, అలాగే ఎంఈడీ రెండు, నాలుగు సెమిస్టర్ల సప్లిమెంటరీ, రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి జరగాల్సిన బీఈడీ, ఎంఈడీ పరీక్షలను డీఎస్సీ (ఉపాధ్యాయ ఉద్యోగ నియామకపు పరీక్ష) రాసే విద్యార్థుల అభ్యర్థన దృష్ట్యా, విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూలై 14వ తేదీకి వాయిదా వేశామన్నారు. రీషెడ్యూల్ అయిన తేదీల టైం టేబుల్ విద్యార్థులు చదువుతున్న కళాశాల నుంచి పొందాలని సూచించారు.


