క్వారీలతో పల్లె రోడ్లు ఛిద్రం
మదనపల్లె రూరల్: మదనపల్లె మండలం కోటవారిపల్లె పంచాయతీలోని క్వారీలతో పల్లె రోడ్లు ఛిద్రమైపోతున్నాయని, వాటి నుంచి వచ్చే దుమ్ముతో పంటపొలాలు దెబ్బతింటున్నాయని, పేలుడు శబ్దాలతో ఇళ్లలో ఉండలేకున్నామని రైతులు ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో ఇచ్చిన అర్జీపై సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి స్పందించారు. రైతుల సమస్యను నేరుగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ, మైనింగ్ సిబ్బందితో కలిసి పర్యటించారు. రోడ్ల దుస్థితిని నేరుగా పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మదనపల్లె మండలం రామసముద్రం రోడ్డు నుంచి కోటవారిపల్లె, ఉడుంవారిపల్లెకు వెళ్లే రహదారి, క్వారీలకు సంబంధించిన భారీ వాహ నాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వర్షాకాలంలో ప్రయాణానికి ఏమాత్రం అనువుగా లేకపోగా, మోకాలిలోతు గుంతలతో ప్రయాణం నరకంగా తయారైందన్నారు. దీనికితోడు క్వారీల నిర్వహణతో వెలువడే దుమ్ము, ధూళి కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. పేలుళ్ల ధాటికి ఇళ్లలో ఉండలేకున్నామని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ గ్రామానికి వచ్చి, రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అవకాశం లేకుండా పోతోందన్నారు. దీనికితోడు క్వారీ నిర్వాహకులు కొండలపై నుంచి దిగువకు నీరు వచ్చే సప్లై ఛానల్స్, చెక్‌డ్యామ్‌లను పూర్తిగా మూసివేశారన్నారు. దీంతో గొర్రెలు, పశువులకు తాగునీటి వసతి లేకపోగా, మేపేందుకు వీలు లేకుండా పోయిందన్నారు. క్వారీలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేటప్పుడు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తామని, గ్రామాల్లో మౌలికవసతులు కల్పిస్తామని, అభివృద్ధికి సహకరిస్తామని చెప్పడం తప్పితే, పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. రైతుల సమస్యలు తెలుసుకున్న సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి...క్షేత్రస్థాయిలో తాను గమనించిన అంశాలు, రహదారుల దుస్థితిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, మండల ఆర్‌ఐ బాలసుబ్రహ్మణ్యం, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, మాజీ సర్పంచ్ సొక్కం సత్యనారాయణ, రైతు సురేష్, వీఆర్వో చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
దుమ్ము, శబ్దాలతో నిత్యం నరకం
సబ్ కలెక్టర్ చల్లాకల్యాణికి రైతుల వినతి


