రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి
రాజంపేట టౌన్: జిల్లాల పునర్విభజన, మండలాల మార్పులు చేర్పులపై అభ్యంతరాలు తెలిపేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు దగ్గర పడుతుండటంతో రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్‌తో చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అందులో భాగంగా జేఏసీ ప్రజాగర్జనకు పిలుపునివ్వడంతో శుక్రవారం రాజంపేట పట్టణంలో ప్రజలు కదం తొక్కారు. రాజంపేట, నందలూరు, పుల్లంపేట మండలాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు. దీంతో పాతబస్టాండ్ సర్కిల్ నలుదిక్కులు కిక్కిరిసి పోయింది. జేఏసీ నాయకులు 11–30 గంటలకు ర్యాలీగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు. ఈసందర్భంగా దారివెంబడి ప్రజలు అన్నమయ్య పుట్టిన గడ్డ రాజంపేట, రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి, వుయ్‌వాంట్ జస్టిస్ అంటూ చేసిన నినాదాలు హోరెత్తించాయి. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని రాజంపేట జిల్లా కేంద్రం అయితే తొమ్మిది మండలాల ప్రజలకు కష్టాలు, ఇబ్బందులు తప్పుతాయని అందువల్ల ఈవిషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సబ్‌కలెక్టర్ భావనకు జేఏసీ నాయకులు వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గతంలో రాజంపేట, రైల్వేకోడూరు, మదనపల్లె ప్రాంతంవైపు ఉండే నియోజకవర్గాలకు రాయచోటి మధ్యలో ఉండేదని అందువల్ల రాయచోటి కేంద్రంగా అన్నమయ్యజిల్లా ఏర్పడిందన్నారు. ప్రస్తుతం మదనపల్లె జిల్లా కేంద్రం అవుతుండటంతో రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాలకు రాజంపేటలో మధ్యలో ఉంటుందని అందువల్ల రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లోని ప్రజలతో పాటు రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, నందలూరు మండల ప్రజలకు రాజంపేట జిల్లా కేంద్రం అయితేనే సౌకర్యవంతంగా ఉంటందన్నారు. లేకుంటే ఆ మండలాల ప్రజలు రెండు బస్సులు మారి వ్యయ ప్రయాసాలకోర్చి రాయచోటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయని తెలిపారు.
పైటకొంగుచాచి వేడుకున్న మహిళలు
రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని పలువురు మహిళలు పైటకొంగుచాచి చంద్రబాబు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు చెందిన మహిళలు ఏదైనా పనిమీద రాయచోటికి వెళ్లాలంటే రెండు బస్సులు మారి వెళ్లాలన్నారు. పనికావడం ఆలస్యమైతే రాత్రి వేళల్లో ఇంటికి చేరుకునేందుకు మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల చంద్రబాబు ప్రభుత్వం మహిళల భధ్రతను కూడా దృష్టిలో పెట్టుకొని అన్నమయ్యజిల్లా కేంద్రం విషయంలో నిర్ణయం తీసుకో వాలని మహిళలు కోరారు. ఈకార్యక్రమంలో జేఏసీ నాయకులు ప్రభాకర్, చిట్వేలి రవికుమార్, అబూబకర్, అల్లం సుబ్రమణ్యం, పూల భాస్కర్, చల్లా సుధాకర్, రాజశేఖర్ నాయక్ పాల్గొన్నారు.
ప్రజాగర్జనలో పెద్దఎత్తున పాల్గొన్న ప్రజలు రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని కొంగుచాచి వేడుకుంటున్న మహిళలు
ప్రజాగర్జనలో గర్జించిన జనం
రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి


