బోయనపల్లెను వీడని గంజాయి వాసన!
రాజంపేట: కడప–రేణిగుంట హైవేలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం బోయనపల్లె.ఈ ప్రాంతాన్ని
గంజాయి వాసన వీడేటట్లు కనిపించడంలేదు.బోయనపల్లెలో వివిధ ఇంజినీరింగ్ విద్యాసంస్ధలు ఉండటంతో ఇతర జిల్లాలకు చెందిన అనేక మంది యువతీ, యువకులు ఉన్నారు. గంజాయి ఎక్కడి నుంచి ఈ ప్రంతానికి వస్తుందనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
గుట్టుచప్పుడుగా గంజాయి అమ్మకాలు..
న్యూ బోయనపల్లెలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనేది ఓపెన్ టాక్. రూ.350, రూ.450, రూ.550లకు విక్రయిస్తున్నట్లు పలువురు చెపుతున్నారు. యువతను అధికంగా ఆకర్షించేలా రహస్యంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకొని గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు తెలిసింది.గంజాయి ఎక్కడి నుంచి దిగుమతి అవుతోందన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. .
పోలీసు సబ్‌కంట్రోల్ ఉన్నా..
న్యూబోయనపల్లెలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీగా ఉంటుంది. అలాగే ట్రాఫిక్ కూడా ఉంటుంది. గతంలో ఇక్కడ సబ్ కంట్రోల్ ఉంది. పోలీసు సిబ్బంది కొరత కారణంగానే నిర్వహణ భారంగా మారిందనే భావనలు శాఖాపరంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడైతే మూతపడింది. గతంలో బోయనపల్లెలో అటు మద్యం, ఇటు గంజాయి మత్తులో యువత వీరంగాలు సృష్టించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.. గతంలో గంజాయి బ్యాచ్‌లో గొడవలకు దిగారు. పోలీసుల వరకువెళ్లింది. ఈ ప్రాంతంలో గంజాయి వాసనను లేకుండా చేయడానికి ఇప్పుడు పోలీసులు దృష్టి సారించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అనుమానితులపై నిఘా..
తాజాగా గంజాయి అమ్మకాలు విషయంలో మన్నూరు పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా కొందరిని పట్టుకున్నారు. ప్రస్తుతం రాజంపేటలో స్పెషల్‌పార్టీ సంచరిస్తోంది. అవాంఛనీయ సంఘటన ప్రాంతాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు
అనుమానితులను విచారిస్తున్న పోలీసులు


