
స్తంభాన్ని ఢీకొని స్కూటరిస్టు మృతి
చాపాడు : మండలంలోని మైదుకూరు– ప్రొద్దుటూరు జాతీయ రహదారిలో విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని కొత్తపల్లె ప్రభుకుమార్(41) గురువారం మృతి చెందారు. మండలంలోని కొట్టాల గ్రామానికి చెందిన ప్రభుకుమార్ లింగాపురం వెళ్లి తిరిగి బైక్‌లో వస్తున్నారు. పల్లవోలు సమీపంలోని కాశినాయన వృద్ధాశ్రమ సమీపంలో ప్రమాదశాత్తూ బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రభుకుమార్‌కు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు.
మావోయిస్టులపై
హత్యాకాండను ఆపండి
– వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
శివప్రసాద్
మదనపల్లె రూరల్ : ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న హత్యాకాండను ఆపి వారితో చర్చలు జరపాలని విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే)పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీయం శివప్రసాద్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 25మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ పేరుతో హత్యచేయడాన్ని ఖండించారు. కొన్ని నెలలుగా మధ్య భారత అడవుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో భారత ప్రభుత్వం హత్యాకాండ కొనసాగిస్తోందన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్‌లో ప్రభుత్వ బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు మరో 25మందికి పైగా మృతి చెందడం బాధాకరమన్నారు. శాంతిచర్చల కోసం మావోయిస్టుపార్టీ కేంద్రప్రభుత్వాన్ని పదే పదే కోరిందని తెలిపారు. ఆపరేషన్ కగార్‌ని ఆపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని మేధావులు, ప్రజాస్వామిక వాదులు కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నా బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోగా, మావోయిస్టులపై నరమేధాన్ని తీవ్రతరం చేసిందన్నారు. అడవి నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించి, అడవిలో సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకే ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయవిచారణ జరిపించాలని కోరారు. బూటకపు ఎన్‌కౌంటర్‌లో మరణించిన నంబాల కేశవరావు, మావోయిస్టు పార్టీ సభ్యులకు వీసీకే పార్టీ తరఫున విప్లవజోహార్లు తెలుపుతున్నామన్నారు.

స్తంభాన్ని ఢీకొని స్కూటరిస్టు మృతి