
కేంద్రీయ విద్యాలయ స్థలం కబ్జా
మదనపల్లె రూరల్ : ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థలం కబ్జాకు గురైంది. వేల కోట్ల రూపాయల విలువ కావడంతో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణాలు జరిపి ఆక్రమించారు. అధికారులు పరిశీలించడంతో అసలు విషయం వెలుగు చూసింది. మండలంలోని వలసపల్లె పంచాయతీలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించారు. అనంతపురం–కృష్ణగిరి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ స్థలం ఖాళీగా ఉండడంతో కొందరు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు అడ్డుకునేందుకు వీలు లేకుండా జహా కాలనీ పేరుతో బోర్డు ఏర్పాటుచేసి పనులు చేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, అసిస్టెంట్ కమిషనర్ అనూరాధ, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ గురువారం ఆ స్థలం పరిశీలించేందుకు వెళ్లగా.. ఆక్రమణల విషయం వెలుగు చూసింది.
పనులు నిలిపివేయాలని ఆదేశం
కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన సర్వే నెంబర్0496/5 స్థలంలో కొంతమేర, రెవెన్యూ సర్వీసెస్ బిల్డింగ్‌కు సంబంధించిన సర్వే నెంబర్ 713/1, 2లో మరింత స్థలాన్ని ఆక్రమించి నిర్మాణా లు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇదే కా కుండా.. కేంద్రీయ విద్యాలయం, హంద్రీ–నీవా కా లువకు ఆనుకుని ఉన్న రెండెకరాల స్థలం పదికోట్ల విలువ చేస్తుంది. ఇక్కడ దాదాపు వందకు పైగా పునాదులు వేసి పనులు సాగిస్తున్నారు. ఆక్రమణలను గుర్తించిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వెంటనే నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధి కారులను ఆదేశించారు. రికార్డులు ఉంటే చూపాల ని సంబంధిత నిర్మాణదారులకు సూచించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని సర్వేయర్, ఆర్‌ఐలను ఆదేశించారు.
రూ.10 కోట్ల తో అక్రమ నిర్మాణాలు
జహా కాలనీ పేరుతో బోర్డు ఏర్పాటు
సబ్ కలెక్టర్ పరిశీలనలో వెలుగులోకి