
ఆక్రమణల పేరు చెప్పి అరాచకం
కడప కార్పొరేషన్ : కడప శాసనసభ్యురాలు ఆర్. మాధవి ఆదేశాలతో కడప నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆక్రమణల పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి ఆస్తులను ధ్వంసం చేయడం లేదా వారి ఆర్థిక మూలలను దెబ్బతీసే పనిలో ఎమ్మెల్యే, వారి అనుచరులు నిత్యం నిమగ్నమవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మొన్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు, వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టి విమర్శించారు. 24వ డివిజన్ కార్పొరేటర్ కె. సూర్యనారాయణ, 2వ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డిలపై ఆరోపణలు చేశారు. అలా మాట్లాడిన మరుసటి రోజే మద్రాసు రోడ్డులో నగరపాలక సంస్థకు చెందిన వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆక్రమణలున్నాయంటూ టౌన్‌ప్లానింగ్ అధికారులను ఉసిగొల్పి కూల్చివేశారు. సదరు వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో రెండు గదులను జయచంద్రారెడ్డి లీజుకు తీసుకొని ఉండటం గమనార్హం. షాపింగ్ కాంప్లెక్స్ లీజుకు ఉన్నవారంతా వర్షం పడకుండా, వర్షపునీరు షాపు ముందు నిలబడకుండా, షాపులోకి వచ్చి వెళ్లేందుకు వీలుగా తాత్కాలికంగా రేకులు అమర్చుకొని, ముందువైపు తాపలు, ర్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అవన్నీ పర్మినెంట్ స్ట్రక్చర్స్ కాదు. ముఖ్యంగా మున్సిపల్ ఉర్దూ బాలుర హైస్కూల్ ప్రహరీ, మున్సిపల్ స్డేడియం పక్కన నగరపాలక సంస్థ నిర్మించిన పబ్లిక్ టాయ్‌లెట్లు వీటికంటే ముందుకు ఉన్నా....టౌన్‌ప్లానింగ్ అధికారులు వాటి జోలికి వెళ్లకపోవడం గమనార్హం. తాత్కాలిక నిర్మాణాలన్నీ విద్యుత్ స్తంభాలకు లోపలే ఉన్నప్పటికీ కూల్చివేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో తాత్కాలిక నిర్మాణాల తొలగింపు
ఎమ్మెల్యేకు, ఫిరాయింపు
కార్పొరేటర్లకు వ్యతిరేకంగా
మాట్లాడినందుకు కక్ష సాధింపు