
ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీప్రసాద్
రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా ఏపీజీఈఏ(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం) అధ్యక్షుడిగా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి డాక్టర్ లక్ష్మీప్రసాద్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికకు కడప జిల్లా అధ్యక్షుడు రఘురాంనాయుడు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ఈ ఎన్నికలు బుధవారం నిర్వహించగా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి అధికారకంగా శుక్రవారం వెలువడ్డాయి.
వాహనం బోల్తా.. ఒకరి మృతి
తాడిపత్రి : మండలంలోని ఇగుడూరు గ్రామం వద్ద బొలెరో లగేజీ వాహనం బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొందరు కర్ణాటక ప్రాంతంలో కొనుగోలు చేసిన జీవాలను బొలెరో లగేజీ వాహనంలో ఎక్కించుకుని తిరుగుప్రయాణమయ్యారు. శుక్రవారం ఇగుడూరు గ్రామం వద్దకు చేరుకోగానే టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పి రహదారిపై బోల్తాపడింది. ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన చాంద్‌బాషా (45) అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ హుస్సేన్ బాషా, ఎర్రగుంట్లకు చెందిన ఆంజనేయులు, గంగప్రతాప్ గాయపడ్డారు. ఘటనపై రూరల్ పీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
43 దిమ్మెలు కూల్చిన ఆకతాయిలు
ఓబులవారిపల్లె : మండలంలోని పున్నాటివారిపల్లి సమీపంలో రైతు ఓబులిబస్సు గారి రమణారెడ్డికి చెందిన వ్యవసాయ భూమి కంచెను ఆకతాయిలు తొలగించా రు. ఉదయం చేను వద్దకు వెళ్లి చూడగా కంచె అమర్చిన 43 సిమెంటు స్తంభాలు విరగగొట్టి ఉండడం గమనించి పోలీసులను ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని రైతు కోరారు. ఎస్‌ఐ రమణ వ్యవసాయ భూమిని పరిశీలించారు.
13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు
కడప సెవెన్‌రోడ్స్ : అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ విషయంలో నిబంధనలు అతిక్రమించారని జిల్లాలోని 13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో 20ఏళ్ల కాలపరిమితితో అసైన్డ్ భూములపై రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణలు చేసిన విషయం తెలిసిందే. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు రావడంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం విచారించింది. అప్పట్లో ఆయా మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అప్పట్లో తహసీల్దార్లుగా పనిచేసిన అనూరాధ(మైదుకూరు), వి.గంగయ్య(పోరుమామిళ్ల) మధుసూదన్‌రెడ్డి(బద్వేల్), విజయకుమారి(వీఎన్‌పల్లె), లక్ష్మీనారాయణ(లింగాల), మహబూబ్ బాషా(సింహాద్రిపురం), గుర్రప్ప(జమ్మలమడుగు), ఉదయభాస్కర్‌రాజు(పెండ్లిమర్రి), సువర్ణ(బి.మఠం), సరస్వతి(కమలాపురం) రామచంద్రుడు(కాశినాయన), వెంకటసుబ్బయ్య(వేముల), శంకర్‌రావు(వల్లూరు)లు షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ప్రధానంగా మైదుకూరు, లింగాల, బి.మఠం, జమ్మలమడుగు మండలాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలిసింది.

ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీప్రసాద్

ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీప్రసాద్