
విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
మదనపల్లె రూరల్ : విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ జనార్దన్ నాయుడు, ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్యంరెడ్డి అన్నారు. విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏపీటీఎస్ విజిలెన్స్ పోలీసులతో తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వీడియో, ఆడియో, వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి విధిగా ఎర్తింగ్ ప్రమాణాలు కలిగిన పరికరాలు ఉపయోగించుకోవాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయ బోర్ల వద్ద భద్రత నియమాలు మరింత విధిగా పాటించాలని పేర్కొన్నారు. అతుకులు లేని వైర్లను ఉపయోగించాలన్నారు. అధికశాతం విద్యుత్ ప్రమాదాలు నిర్లక్ష్యంతోనే సంభవిస్తున్నాయన్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు తడిసిన విద్యుత్ స్తంభాలు, వైర్లను తాకరాదన్నారు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా తక్కువ ఎత్తులో ఉన్న తీగలను ముట్టుకోవద్దన్నారు. పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ భద్రతపై ప్రజలు మెరుగైన అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యుత్ సంబంధిత సమస్యలు లేదా అనుమానాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు.