రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 12వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలని ఆయన తెలిపారు.
గంగమ్మా..కరుణించమ్మా..
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. తలనీలాలు అర్పించారు. గంగమ్మా..వర్షాలు సకాలంతో కురిపించమ్మా...కరుణించి.. కాపాడు తల్లీ అంటూ వేడుకున్నారు. చుట్టుపక్కల వారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నేటి నుంచి అన్నమాచార్యుడి జయంత్యుత్సవాలు
రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు 617 జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ తాళ్లపాక, 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద ఏర్పాట్లను పూర్తిచేసింది. ఈనెల 18వరకు ఉత్సవాలు జరుగుతాయని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు అధికారులు తెలిపారు. తొలిరోజు గోష్టిగానంతో ఉత్సవాలు ప్రారంభమవతాయి. సంగీతసభలు, హరికథలు ఉంటాయని చెప్పారు.ఈ సందర్భంగా శ్రీనివాసుని కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఊంజల్‌సేవ జరగుతుందని వివరించారు. కాగా తాళ్లపాక ధ్యానమందిరం ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాట్లు చేశారు.
కొనసాగుతున్న సీహెచ్‌ఓల సమ్మె
రాయచోటి: సమస్యల పరిష్కారం కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్‌ఓ) చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. ఆదివారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమ్మె కొనసాగింపుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం పడకేసింది. దగ్గు,జలుబు, జ్వరం లాంటి వ్యాధులకు చికిత్స అందించే ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం ఏమాత్రం స్పందన చూపడం లేదని సీహెచ్‌ఓలు విమర్శించారు. ప్రోత్సాహకాల బకాయిలను 7 నెలలుగా చెల్లించకపోవడం దారుణమని అన్నారు. వేతన సవరణ అంశం, ప్రోవిడెంట్ ఫండ్ తదితర వాటిపై అసోసియేషన్ నాయకులతో త్వరితగతిన చర్చలు జరిపి పరిష్కారం కోసం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. కార్య క్రమంలో ఏపీఎంసీ అన్నమయ్య జిల్లా నాయకులు సాల్మోహన్, అహ్మద్‌బాషా, శివ కుమార్, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి అన్నమాచార్యుడి జయంత్యుత్సవాలు

కొనసాగుతున్న సీహెచ్‌ఓల సమ్మె