
తల్లికి వందనం.. వీడని సందిగ్ధం !
రాయచోటి : తల్లికి వందనంపై ప్రభుత్వం వైపు నుంచి వారి అనుకూల పత్రికలు, సోషల్ మీడియా ద్వారా వినిపిస్తున్న నిబంధనలు, మార్గదర్శకాలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనలు, నీలినీడలు అలుముకున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఇస్తామన్న తల్లికి వందనం గత ఏడాదికి వర్తిస్తుందా లేక రానున్న విద్యా సంవత్సరానికి వర్తిస్తుందా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా మే నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులకు సమాయాత్తమవుతోంది. ఈ మేరకు మార్గదర్శకాలపై జరుగుతున్న కసరత్తుతో ఎంత మంది తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందోనన్న కలవరం మొదలైంది. విద్యా సంవత్సరం ప్రారంభం ముందుగానే తల్లికి వందనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు ఈ పథకం అమలుపైన స్పష్టత ఇచ్చినా నమ్మకం లేకుండాపోయింది. ఒకవేళ చెల్లిస్తే ఇదే విడతలోనే అమలు చేస్తారా.. రెండు విడతలుగా చెల్లిస్తారా అనేది చర్చగా మారింది. ఇక దాదాపుగా ఈ పథకం అమలులో నిబంధనలు ఖరారైనట్లు జరుగుతున్న ప్రచారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
అమలుపై కసరత్తు..
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనంపైన చేస్తున్న కసరత్తుపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది. బడ్జెట్‌లో ఈ పథకం కోసం నిధులు కేటాయించినా పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. హామీ ఇచ్చిన విధంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున ఇస్తారా లేక నిబంధనల పేరుతో కోత పెడతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల సభలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఇస్తామని చెబుతూనే.. ఒక ఇన్‌స్టాల్‌మెంటా లేక ఎలా ఇవ్వాలనేది ఆలోచన చేస్తున్నామని వెల్లడించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
చంద్రబాబు నుంచి రాని క్లారిటీ..
తల్లికి వందనం పథకాన్ని విద్యా సంవత్పరం ప్రారంభం ముందే అమలు చేస్తామని చెబుతున్నా పథకం అమలు విషయంలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో ఒకే విడతలో రూ.15 వేలు చెల్లిస్తారా.. రెండు విడతలుగా రూ.7500 చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య.. కావాల్సిన నిధుల పైన ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి ఉండటంతో ఇన్‌స్టాల్‌మెంట్ అంశం తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. 2025–26 బడ్జెట్‌లో రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయించారు. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లాలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2,41,026 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా ఈ పథకానికి ఎంత మంది విద్యార్థులు అర్హులుగా ఉంటారో విద్యాశాఖ తేల్చాల్సి ఉంది.
నిబంధనలు..
ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతున్నట్లు సమాచారం. పథకం అమలులో భాగంగా విద్యార్థులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్లరేషన్‌కార్డులు లేని వారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి పథకం వర్తిస్తుందా లేదా వేచి చూడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
జిల్లాలో 2731 పాఠశాలల్లో 2,41,026 మంది విద్యార్థుల
ఎదురుచూపులు
ప్రభుత్వం తాజా నిర్ణయాలు,
నిబంధనలతో నీలినీడలు
ఒకేసారి ఇస్తారా లేక కంతుల వారీగానా అన్న అనుమానాలు
కొత్త నిబంధనలతో
తల్లిదండ్రుల్లో ఆందోళన