
రాజధాని సెంటిమెట్‌తో రియల్ ఎస్టేట్ వ్యాపారం
మదనపల్లె : రాష్ట్ర రాజధాని అమరావతి సెంటిమెంట్‌తో ఇప్పటికే రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని సేకరించిన చంద్రబాబు.. తాజాగా విస్తరణ పేరుతో మరో 44 వేల ఎకరాల భూములను సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధమవుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్ అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ....ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు, రాజధాని పేరుతో కొత్త నాటకానికి తెర తీశారన్నారు. మూడు వాణిజ్యపంటలు పండే ఎంతో సారవంతమైన 34,568 ఎకరాల భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా గతంలో చంద్రబాబు సేకరించారన్నారు. ఐదేళ్లపాటు అమరావతి అభివృద్ధి అంటూ గ్రాఫిక్స్‌లో బొమ్మలు చూపించి, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు మినహా ఎలాంటి ప్రగతి చూపలేదన్నారు. రైతులు ఇచ్చిన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కాలం గడిపేసి, నేడు మరోసారి రాజధాని విస్తరణ పేరుతో మరో 44 వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కునేందుకు సిద్ధమయ్యారన్నారు. వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు కేటాయించి సొమ్ము చేసుకునేందుకు పావులు కదుపుతున్నారన్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయన్నారు. భూములు కోల్పోతున్న రైతుల్లో అధికభాగం ఎస్సీ, ఎస్టీ సామాజిక చెందిన వ్యక్తులు ఉండటంతో వారి జీవనోపాధికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు
బందెల గౌతమ్‌కుమార్