కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి

Apr 3 2025 12:27 AM | Updated on Apr 3 2025 12:27 AM

కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి

కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి

రాయచోటి : అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి పాలన వైఫల్యాలను శ్రీకాంత్‌ రెడ్డి ఎండగట్టారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో కరువు ఛాయలు పెద్దగా కనిపించలేదన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మొదటి ఏడాదిలోనే దారుణమైన కరువు పరిస్థితులు దాపురించాయన్నారు. కరువు కారణంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అరకొర నీటితో సాగు చేసి పండించిన పంటలను అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. టమాటా, ఇతర పండ్ల తోటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల బోర్లు ఎండుతున్నాయన్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతలలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. దశాబ్దాల తరబడి దిగుబడి అందించాల్సిన మామిడి తోటలు నిట్టనిలువునా ఎండిపోతున్నాయన్నారు. వేల రూపాయలు పెట్టి ట్యాంకర్ల ద్వారా మామిడి చెట్లకు నీరు నింపుకోలేని పరిస్థితులు ఉన్నాయన్నారు.

కరువు పరిస్థితులు కనిపించలేదా?

రాష్ట్ర ప్రభుత్వం 51 కరువు మండలాలను ప్రకటించిందన్నారు. అన్నమయ్య జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాయచోటి నియోజకవర్గంలో ఆరు మండలాల్లోనూ ఉన్న తీవ్ర కరువు పరిస్థితులు ప్రభుత్వానికి కనపడలేదా అని ప్రశ్నించారు. రైతులు బంగారాన్ని తాకట్టు పెట్టి బోర్లు వేస్తున్నారన్నారు. కరువు మండలాలుగా ప్రకటించడంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే రేపు ఇన్సూరెన్సులు ఏ విధంగా ఇస్తారని నిలదీశారు. నాడు జగన్‌ ప్రభుత్వమే ఇన్సూరెన్సులకు ప్రీమియం చెల్లించిందన్నారు. ఈ ఏడాదికి రైతు భరోసా ఒక్క రూపాయి చెల్లించలేని దుస్థితిలో ఉన్నారన్నారు. అన్నమయ్య జిల్లాను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.

వక్ఫ్‌ సవరణ చట్టంపై

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరి స్పష్టం

వక్ఫ్‌ సవరణ చట్టంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరి స్పష్టం చేసిందన్నారు. వక్ఫ్‌ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పార్లమెంటు సాక్షిగా వైఎస్సార్‌సీపీ ప్రకటించిందన్నారు. లోక్‌సభలో ఎంపీ మిథున్‌ రెడ్డి, ఇతర ఎంపీలు స్వయంగా ప్రకటించారన్నారు. రాష్ట్రంలో సెక్యులర్‌ పార్టీ అయిన వైఎస్సార్‌సీపీ నిజాయితీ, విలువలతో అందరి మనోభావాలను గౌరవిస్తూ నడుస్తోందన్నారు.

కూటమి ప్రభుత్వ పాలన అస్తవ్యస్తం..

కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా విద్యారంగం, సంక్షేమ పథకాల అమలు, శాంతి భద్రతలు రాష్ట్రంలో దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. వడ్డెర కులానికి చెందిన తిరుపతి వారాధి దారుణంగా హత్యకు గురయ్యారన్నారు. పట్టణంలో గ్యాంగ్‌ వార్లు, అల్లర్లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైస్కూల్‌ టీచర్‌ను ఆ పాఠశాల విద్యార్థులే చంపితే దానిపై ఇప్పటి వరకు అతీగతి లేదన్నారు. రాయచోటిలో విచ్చలవిడిగా జరుగుత్ను డ్రగ్స్‌ వాడకాన్ని అరికట్టాలన్నారు. కూటమి పాలన వచ్చిన తరువాత అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో అభివృద్ధి జాడ లేకుండా పోయిందన్నారు. మున్సిపాల్టీలలో పారిశద్ధ్యం లోపించిందన్నారు. దేశంలోనే ధనిక సీఎంగా పేరు పొందడం కాదు.. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయాలని సీఎం చంద్రబాబునాయుడుకు శ్రీకాంత్‌ రెడ్డి సూచించారు. తమ హయాంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి రూపురేఖలు మార్చామన్నారు. ఇప్పుడు క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ మంజూరు కావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా గత ప్రభుత్వంపైన ఇంకా విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ ఒక్క పథకం ఇవ్వకున్నా ఏడాది కాకమునుపే రూ.1.50 లక్షల కోట్లను ఈ ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. సమావేశంలో రాయచోటి మన్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాషా, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

వక్ఫ్‌ బిల్లుపై పునరాలోచించాలి

శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించాలి

మీడియా సమావేశంలో వైఎస్సార్‌

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement