
తంబళ్లపల్లెలో వైఎస్సార్‌సీపీదే గెలుపు!
బి.కొత్తకోట: అసెంబ్లీ ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి విజయం నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సాధించిన విజయాలు, ప్రజలు అందించిన ఓట్ల బలం చూస్తే ఈనెల 13న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమ తథ్యమని తెలుస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ 59.48 శాతం ఓట్లు సాధిస్తే, 2022లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 61.35 శాతం ఓట్ల ఆధిక్యం సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ 2019 అసెంబ్లీ ఎన్నికలకంటే దారుణంగా ప్రజల్లో మద్దతు కోల్పోయినట్లు తెలుస్తోంది.
వైఎస్సార్‌సీపీకి 61.35 శాతం ఓట్లు
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పోటీచేయగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారు. పోలైన ఓట్లలో ద్వారకనాథరెడ్డికి 1,05,444 ఓట్లు రాగా 46,938 ఓట్ల మెజార్టీ సాధించి 59.48 శాతం ఓట్ల వాటా దక్కించుకొన్నారు. 76 పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే 63 పంచాయతీలు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కై వసం చేసుకొన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 61.35 శాతం ఓట్లు పొందింది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన ఓట్ల శాతంకంటే 1.87 శాతం ఎక్కువ.
22.56 శాతానికి పడిపోయిన టీడీపీ బలం
పంచాయతీ ఎన్నికలతోనే తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ బలమెంతో తేలిపోయింది. 76 సర్పంచు పదవులకు పోటీ జరిగితే టీడీపీ మద్దతుదారులు కురబలకోట మండలంలో 2, తంబళ్లపల్లె మండలంలో 3, పెద్దమండ్యం మండలంలో 1, పెద్దతిప్పసముద్రం మండలంలో 4 సర్పంచు పదవులను గెలిచారు. పోలైన 1,15,571 ఓట్లలో టీడీపీ మద్దతుదారులైన సర్పంచు అభ్యర్థులు, ఓడిపోయిన సర్పంచు అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు 26,083. ఇది పోలైన ఓట్లలో 22.56 శాతం. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ తరపున కొత్త అభ్యర్థి జయచంద్రారెడ్డి పోటీ చేయడం, ఆయనకు టీడీపీ శ్రేణులు మద్దతు ఇవ్వకపోవడం, అభ్యర్థి కూడా ప్రజలను కలవకపోవడం లాంటి అంశాలు ఆయనకు ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన ఓటమి తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 59.48 శాతం ఓట్లు
పంచాయతీ ఎన్నికల్లో 61.35 శాతం ఓట్ల ఆధిక్యం
టీడీపీ ఓట్ల బలం 22.56 శాతానికిపడిపోయిన వైనం
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోవైఎస్సార్‌సీపీ గెలుపు నల్లేరు మీద నడకే