
రాజంపేట బైపాస్‌లో ఉన్న దీక్షాశిబిరం
రాజంపేట : ఆది నుంచి వర్గరాజకీయాలకు నిలయమైన రాజంపేట తెలుగుదేశం పార్టీలో తాజాగా పచ్చదీక్షల పాలిట్రిక్స్‌కు ఆశావహులు తెరలేపారు. సోమవారం టీడీపీ వారి దీక్షల సందడి చూసి జనం నవ్వుకుంటున్నారు. తమ అధినేత స్కిల్‌స్కాంలో జైలుకు వెళ్లిన నేపథ్యంలో రాజంపేట టీడీపీ టికెట్ ఆశావహులకు దీక్షల రాజకీయాలు బాగా కలిసివచ్చాయి. దీంతో ఎటు వెళ్లాలో తెలియక తమ్ముళ్లలో బిత్తరపాటు కనిపించింది.
రాజంపేట ఆర్‌ఎస్‌రోడ్డులో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు నిరాహారదీక్ష నిర్వహిస్తున్నారు. తన వెంట నడుస్తున్న పార్టీ క్యాడర్‌తో బాబు అరెస్టుపై హడాహుడి చేస్తున్న సంగతి తెలిసిందే. సో మవారం రాజంపేట బైపాస్ రహదారిలోని తను ఏ ర్పాటు చేసుకున్న టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద మేడా విజయశేఖర్‌రెడ్డి కూడా ఒక దీక్షా శిబిరం ఏర్పాటుచేశారు. అలాగే రాజు విద్యాసంస్ధల అధినేత చామ ర్తి జగన్‌మోహన్‌రాజు మన్నూరు సీఐ కార్యాలయం ఎదురుగా నిరసన దీక్షను చేపట్టారు. ఈ విధంగా వేర్వేరుగా నిరసన,నిరాహారదీక్షలను చేసుకున్నారు.
పోటీగా మరో దీక్షాశిబిరం?
ఆశావహుల మధ్య దీక్షల కుంపటి రాజుకుంది. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న గంటా నరహరి కూడా బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా నిరాహారదీక్ష పెట్టే యోచనలో ఉన్నట్లు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. తమ పార్టీ టీడీపీతో కలిసి పనిచేయాలని తమ పార్టీ హైకమాండ్ ఆదేశించిన నేపథ్యంలో అరకొరగా ఉన్న జనసేనలు దీక్షా శిబిరాల వద్ద వెళ్లేందుకు అపోసోపాలు పడుతున్నారు. రాజంపేట టికెట్ పొత్తులో జనసేనకు ఇస్తున్న క్రమంలో తెరపైకి వచ్చిన ఆశావహులు యల్లటూరు శ్రీనువాసరాజు, అతికారి దినేష్‌లు మాత్రం పచ్చదీక్షల పాలిట్రిక్స్‌క్ దూరంగా ఉన్నారు.
మదనపల్లె టీడీపీలో మూడుముక్కలాట
మదనపల్లె : మదనపల్లె టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్కిల్ స్కామ్‌లో అరెస్ట్‌తో జైలులో ఉన్నప్పటికీ నాయకుల మధ్య ఐక్యత కనిపించలేదు. నిరసనలు, దీక్షలు సంఘటితంగా చేయాల్సిందిపోయి ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా మూడుముక్కలుగా చీలిపోయి ఎవరి బలాన్ని వారు ప్రదర్శించుకునే పనిలో పడ్డారు. గాంధీజీ జయంతి సందర్భంగా పార్టీ అధిష్టానం పిలుపుమేరకు టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సత్యమేవ జయతే దీక్షలు ముగ్గురు నాయకుల ఆధ్వర్యంలో మూడుచోట్ల ఎడముఖం, పెడముఖంగా జరిగాయి. టీడీపీ ఇన్‌చార్జి దొమ్మలపాటిరమేష్ ఆధ్వర్యంలో అన్నమయ్య సర్కిల్‌లోని పార్టీ కార్యాలయం ఎదురుగా జరిగిన దీక్షలో ఆయన అనుచరులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్‌చినబాబు ఆధ్వర్యంలో నీరుగట్టువారిపల్లెలోని ఓ ప్రైవేట్ స్థలంలో నిర్వహించిన దీక్షలో నేతకార్మికులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ఆధ్వర్యంలో బెంగళూరు బస్టాండులోని ఆయన కార్యాలయంలో ఆయన అనుచరులతో దీక్ష నిర్వహించారు. నాయకులు ఎవరికి వారు ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు దీక్షలు జరిపితే, కార్యకర్తలు, చోటానాయకులు ఎవరి వద్దకు వెళ్లాలో దిక్కుతోచని అయోమయస్థితిలో పడిపోయారు. టీడీపీ నాయకుల పరిస్థితి ఇలా ఉంటే.. పవన్‌కల్యాణ్ ప్రకటనతో కొత్త పొత్తును చూసి మురిసిపోతున్న జనసేన నాయకులు గంగారపురామదాస్‌చౌదరి, జంగాలశివరాం తదితరులు..టీడీపీకి మేమే దిక్కు... మమ్మల్ని విడిస్తే మీకు మనుగడ లేదనే రీతిలో వారి మధ్య వెళ్లి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కరుడుగట్టిన టీడీపీ నాయకులు జనసేన నాయకుల ఓవర్‌యాక్షన్‌పై లోలోపల మండిపోతూ, ఖర్మకాలి పార్టీకి చేటుకాలం వచ్చింది కనుకే మాయదారి సంతను భరించాల్సి వస్తోందంటూ బహిరంగంగా పైకి చెప్పకపోయినా, తమ వారితో కలిసి ఆవేదనను పంచుకున్నారు.