
పర్వతారోహకులతో వైవీయూ అధికారులు
వైవీయూ : పర్యాటక రంగంలో ‘అడ్వెంచర్ టూరిజం’ విశిష్టమైనదని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు, వైవీయూ ఆర్ట్స్ విభాగం డీన్ ఆచార్య తప్పెట రామప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కడప నగరంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ‘పర్వతారోహకుల పరిచయ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రఖ్యాత పర్వతాలను అధిరోహించిన జి. సురేష్‌బాబు, వి. శ్రీలత, రేపల్లె సుందరరాజు, గానుగపెంట హరిప్రసాద్‌లను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య తప్పెట రామప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పర్యాటకం అనేది మనిషి మానసిక ఆనందం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచారం చేయడమేనని, అందులో భాగంగా ప్రాణాలకు తెగించి సాహసోపేతంగా చేసే పర్వతారోహణమనేది ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు. పర్వతారోహకుడు సురేష్‌బాబు మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేలా కఠినశిక్షణ పొంది తన 18వ ఏట 8848 మీటర్ల ఎత్తుగల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన యువకెరటమన్నారు. దీంతో పాటు 8516 మీటర్ల ఎల్తైన పర్వతాలెక్కి ఆయన సత్తాచాటారన్నారు. నంతరం పర్వతారోహకులు సురేష్‌బాబు, శ్రీలత, రేపల్లె సుందరరాజు, గానుగపెంట హరిప్రసాద్‌లు పర్వతారోహణలో ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు.వైవీయూ పాలకమండలి సభ్యుడు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి, ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. సలీంబాషా మాట్లాడారు. కార్యక్రమంలో వైవీయూ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. ఎన్. వెంకటరామిరెడ్డి, సీపీ బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రం భాషా పరిశోధన కేంద్రం సలహామండలి సభ్యులు జానుమద్ది విజయభాస్కర్, గానుగపెంట హనుమంతరావు, మొగిలిచెండు సురేష్, భూపతిరాయల్, కొత్తపల్లి రామాంజనేయులు వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.