
సిబ్బందిని విచారణ చేస్తున్న వైద్యులు పాల్ రవికుమార్
మదనపల్లె : ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి మెటర్నరీ వార్డులో సిబ్బంది నగదు వసూళ్లపై సోమవారం ఈఎన్‌టీ వైద్యులు పాల్ రవికుమార్ విచారణ జరిపారు. వారంరోజుల క్రితం తంబళ్లపల్లె నియోజకవర్గం కోసువారిపల్లెకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ మహేశ్వర్‌రెడ్డి తన భార్య అరుణారెడ్డి ప్రసవ నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేర్పిస్తే మెటర్నరీ వార్డులోని సిబ్బంది వైద్యసేవలకు తన వద్ద నగదు వసూలు చేశారని, పురిటిబిడ్డకు బొబ్బలు వస్తే వైద్య విషయంలో నిర్లక్ష్యం కనపరిచారని పత్రికాముఖంగా ఆరోపించారు. ఈ విషయమై పత్రికల్లో వార్తలు రావడంతో స్పందించిన ఎమ్మెల్యే నవాజ్‌బాషా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మెటర్నరీ వార్డు సిబ్బంది వసూళ్లపై బాధితుడు మహేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరపాల్సిందిగా వైద్యులు పాల్ రవికుమార్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పాల్ రవికుమార్ మెటర్నరీ వార్డు సిబ్బందిని వేర్వేరుగా, ఉమ్మడిగా విచారణ చేశారు. బాధితుల నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. విచారణ నివేదికలను మెడికల్ సూపరింటెండెంట్ పద్మాంజలిదేవికి అందజేస్తానని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు.