
అచ్చెన్న (ఫైల్)
సాక్షి ప్రతినిధి, కడప/కడప అర్బన్: పశుసంవర్థక శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అచ్చెన్న అనుమానాస్పద మృతిని ఎట్టకేలకు పోలీసులు హత్యగా నిర్ధారించారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సుభాష్ చంద్రబోస్ పక్కా పథకం ప్రకారం ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. డాక్టర్ అచ్చెన్న శాఖాపరమైన వేధింపులే హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చెన్నను ఒప్పందం చేసుకున్న మరో ఇరువురి సహకారంతో డాక్టర్ సుభాష్‌చంద్రబోస్ కిడ్నాప్ చేసి, ఆపై పథకం ప్రకారం అంతమొందించాడు. బొలోరో వాహనంలో అచ్చెన్నను తీసుకెళ్లిన ముఠా అతనికి మద్యం తాపించి ఆ తర్వాత గువ్వలచెరువు ఘాట్‌లో ప్రొటెక్షన్ వాల్ మీద నుంచి కిందికి తోసేసినట్లు తెలుస్తోంది.
సూత్రధారి.. పాత్రధారి సుభాష్ చంద్రబోస్..
డాక్టర్ అచ్చెన్న హత్యలో సూత్రధారి.. పాత్రధారి డాక్టర్ సుభాష్ చంద్రబోస్ అని తేలినట్లు సమాచారం. బోస్‌కు దగ్గరి మనుషులు మరో ఇద్దరిని పురమాయించుకొని చర్చి నుంచి వస్తున్న అచ్చెన్నను వెంబడించి, మంచి మాటలు చెప్పి బొలోరో వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు సమాచారం. గువ్వలచెరువు ఘాట్‌కు అవతల వైపు రామాపురం పోలీసు స్టేషన్ పరిధిలో అందరూ కలసి మద్యం సేవించిన అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు. అప్పటికే ఆవేశంతో రగిలిపోతున్న బోస్ బృందం ఘాట్‌లోకి రాగానే, ఒక్కమారుగా 12 అడుగుల లోతున్న లోయలోకి తోసేసినట్లు తెలుస్తోంది. ముందుగానే మధుమేహ వ్యాధితో బాధపడుతున్న అచ్చెన్న అంత ఎత్తు నుంచి కిందపడిపోతే ఎలాగైనా మరణిస్తాడనే నమ్మకంతోనే అతన్ని చంపేందుకు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలిసింది. ముందు జాగ్రత్తగా అచ్చెన్న సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసినప్పటికీ చంద్రబోస్ సెల్‌ఫోన్ మాత్రం ఆన్‌లోనే ఉండటంతో అదే అతన్ని పట్టించినట్లు తెలుస్తోంది.
మిస్సింగ్ కేసు
ఛేదించే క్రమంలో..
డాక్టర్ అచ్చెన్న రెండు రోజులుగా కన్పించడం లేదని ఆయన కుమారుడు డాక్టర్ క్లింటన్ చక్రవర్తి కడప ఒన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిపార్టుమెంటు పరిధిలో ఉన్న గొడవల కారణంగా జేడీ శారదమ్మ, ఇరువురు ఏడీలు సుధీర్‌నాథ్ బెనర్జీ, శ్రీధర్ లింగారెడ్డి, చంద్రబోస్ మరి కొంత మందిపై అనుమానం ఉన్నట్లు ఆరోపిస్తూ 14వతేదీ పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందించారు. ఆమేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, అనుమానితులుగా ఉన్నవారు మూడు రోజులుగా ఎక్కడెక్కడ ఉన్నారు. రోజువారి వివరాలను వారి ద్వారానే పోలీసులు సేకరించారు. ఈ నేపథ్యంలో ఈనెల 24న గువ్వలచెరువు ఘాట్‌లో పడి ఉన్న గుర్తుతెలియని మృతదేహం డాక్టర్ అచ్చెన్నదిగా గుర్తించారు. దీంతో అనుమానితులుగా భావిస్తున్న వారు ఈనెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వారి కదలికలకు సంబంధించి తమకు అందించిన సమాచారం సరిగ్గా ఉందా? లేదా? అని పోలీసులు క్రాస్ చెక్ చేశారు. ఈ క్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సుభాష్‌చంద్రబోస్ ఫోన్ గువ్వలచెరువు టవర్ లొకేషన్ పరిధిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు మరో ఇరువురు ప్రైవేటు వ్యక్తుల సహకారంతో తానే ఈ హత్యకు పాల్పడినట్లు డాక్టర్ సుభాష్ చంద్రబోస్ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది.
మరింత లోతుగా దర్యాప్తు..
డాక్టర్ అచ్చెన్న హత్యలో డాక్టర్ సుభాష్ చంద్రబోస్, మరో ఇరువురు కాకుండా ఇంకా ఎవరైనా సహకారం అందించారా? ప్రత్యక్షంగా పాల్గొన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే సీసీ పుటేజీల ఆధారంగా అచ్చెన్నను తీసుకెళ్లిన వాహనాన్ని గుర్తించినట్లు సమాచారం. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పోలీసులు సంయుక్తంగా కేసును ఛేదించే పనిలో ఉన్నారు. నేడో రేపో మీడియా ముందు నిందితులను ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.
కిడ్నాప్ చేసి.. హత్య చేశారు
పశుసంవర్థక శాఖలో విభేదాలే కారణం
కర్త, కర్మ, క్రియ డాక్టర్ సుభాష్ చంద్రబోస్
పోలీసుల అదుపులో నిందితులు
నేడో, రేపో మీడియా ముందుకు