నిమ్మనపల్లె : సాగు చేసుకుంటున్న పొలాన్ని వదిలేయకపోతే చంపేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారని రాచవేటివారిపల్లెకు చెందిన మహిళారైతు బిడ్డల మంజుల భర్త శ్రీధర్‌రెడ్డితో కలిసి ఆదివారం డీఎస్పీ కేశప్పకు ఫిర్యాదు చేసింది. రాచవేటివారిపల్లె సర్వే నంబర్: 701/2లో తమకు 4.98 ఎకరాల పొలం ఉందని, భూమికి సంబంధించిన అన్ని రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకం, వన్‌బీ తదితర ధ్రువపత్రాలు ఉన్నాయన్నారు. తమకు ఉన్నటువంటి పొలాన్ని సాగు చేసుకుంటూ, పాడిపశువులను మేపుకొంటూ పొలం వద్దే నివసిస్తున్నామన్నారు. అయితే పుంగనూరుకు చెందిన బి.ఈశ్వర్‌రెడ్డి, ఆయన తల్లి బి.రెడ్డికుమారి స్థానికులైన మరికొందరితో కలిసి తమపై దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. సదరు భూమిపై ఇరువర్గాల మధ్య మదనపల్లె కోర్టులో కేసు నడుస్తోందన్నారు. అయితే ఆ భూమి తమదేనని, మీరు పొలం వదలకపోతే చంపేస్తామని బెదిరించి పొలం వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. స్పందించిన డీఎస్పీ కేశప్ప వెంటనే నిమ్మనపల్లె పోలీసులకు సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ఆమేరకు హెడ్‌కానిస్టేబుల్ చక్రవర్తి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి సమస్యను పరిష్కరించారు.
మహిళా రైతు భర్తతో కలిసి డీఎస్పీకి ఫిర్యాదు