
తాడేపల్లి : సవీంద్ర కేసులో పోలీసుల వ్యవహార శైలిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం గొప్ప విషయమన్నారు వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి. పోలీసుల వైఖరిపై హైకోర్టు సుమోటోగా స్వీకరించి సీబీఐకి అప్పగించడం అనేది మంచి పరిణామన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అయితే, పోలీసుల పని తీరుకు నిదర్శనమన్నారు. ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్ 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. వెంటనే హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘రాష్ట్ర ప్రభుత్వం పౌరుల హక్కులను కాలరాస్తోంది. హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసుల్లో మార్పు రాలేదు. బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చామని డాక్టర్ కాకర్ల సుబ్బారావే స్వయంగా చెప్పారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. జగన్ పర్యటనలను నియంత్రిస్తున్నారు. జగన్ సభలకు వచ్చే వారిని డ్రోన్ కెమెరాలతో గుర్తించి కేసులు పెడుతున్నారు. సాక్షి విలేరకర్లు, యాజమాన్యం మీద తప్పుడు కేసులు పెట్టారు.
తప్పుడు కేసుల విషయంలో డీజీపీని కోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించినా పోలీసుల్లో మార్పు రాలేదు. తప్పు చేస్తే కేసులు పెట్టాలిగానీ అరెస్టులు చేయటానికే కేసులు పెడుతున్నారు. పోసాని కృష్ణమురళి, తురకా కిషోర్ సహా అనేకమంది మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. ఆరేళ్ల క్రితం ఏదో జరిగిందని ఇప్పుడు కేసులు పెడుతున్నారు. సవీంద్ర కేసులో మఫ్టీలో వెళ్ళి అరెస్టు చేయటంపై హైకోర్టు సీరియస్ అయింది. హైకోర్టు ఉద్యోగి జడ్జీలకు ఫైళ్లను తీసుకెళ్తుంటే సీఐ శ్రీనివాస్ దాడి చేశాడు.
జడ్జీల ఫైళ్లు ఉన్న వాహనాన్ని కూడా పీఎస్‌కి తరలించారు. ఏపీలో పోలీసుల పనితీరుకు ఇదే నిదర్శనం. టీడీపీ సోషల్ మీడియా వైఎస్సార్ సీపీ నేతల కుటుంబాలపై పెడుతున్న దారుణమైన పోస్టులు ప్రభుత్వానికి కనపడటం లేదా?, ఐ-టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలి. వ్యక్తిత్వ హననం చేస్తూ పెట్టిన పోస్టులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?, జగన్ ఫోటో వాట్సప్ డీపీ పెట్టుకుంటే కేసులు పెడుతున్నారు. బైకుల మీద జగన్ బొమ్మ కనపడితే సీజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎల్లోమీడియా పైత్యం బాగా పెరిగింది. జగన్ రాష్ట్రం కోసం అప్పులు చేస్తే సోమాలియా, శ్రీలంక అవుతోందని రాశారు. అదే చంద్రబాబు అప్పులు చేస్తే రుణ సమీకరణ అంటూ ముద్దుగా రాస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:
సవీంద్ర అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగిస్తూ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు