జగనన్న హయాంలోనే ‘గండి’ అభివృద్ధి | YSRCP MP Avinash Reddy Visits Gandi Veeranjaneya Swamy Temple | Sakshi
Sakshi News home page

జగనన్న హయాంలోనే ‘గండి’ అభివృద్ధి

May 13 2026 5:43 AM | Updated on May 13 2026 5:43 AM

YSRCP MP Avinash Reddy Visits Gandi Veeranjaneya Swamy Temple

గండి గర్భాలయంపై కలశ ప్రతిష్ట కార్యక్రమంలో పూజలు చేస్తున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి 

చక్రాయపేట: వైఎస్‌ జగన్‌ హయాంలోనే గండి క్షేత్రం అభివృద్ధి చెందడం సంతోషకరమని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి వ్యాఖ్యానించా­రు. ఆలయ మహాకుంభాభిషేకం, హనుమజ్జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన వైఎస్సార్‌ కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్, చైర్మన్‌ వెంకటస్వామి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు చేయించి తీర్థ ప్రసా­దాలను అందించి ఆశీర్వదించారు.

అనంతరం కుంబాభిషేకంలో భాగంగా ఆలయ ఆవరణలో నిర్వహించే పలు పూజా కార్యక్రమాల్లో, గర్భాలయం పైభాగాన కలశ ప్రతిష్ట కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో రూ.28.5 కోట్లతో గండి ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఆలయం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రారంభోత్సవానికి నోచుకోలేదన్నారు. ఆలయంతో పాటు రాజగోపురాలు కూడా అత్యంత సుందరంగా తయారయ్యాయని చెప్పారు. పూర్ణాహుతి అనంతరం బుధవారం నుంచి భక్తులకు ఆంజనేయస్వామి మూలవిరాట్‌ దర్శనం ఉంటుందని చెప్పారు.

ఈ సందర్భంగా గంగాధర్‌ అనే భక్తుడు తనకు అనుమతులు ఇప్పిస్తే గండిలో తన సొంత నిధులతో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మిస్తానని కోరగా, దీనికి స్పందించిన ఆయన కలెక్టర్, కమిషనర్‌తో మాట్లాడతానని చెప్పారు. హనుమజ్జయంతి సందర్భంగా ఆంజ­నేయ స్వామి భక్తులందరికీ ఎంపీ శుభాకాంక్షలు తెలియజేశారు. చక్రాయపేటలోని శ్రీవేంకటేశ్వర రాచరాయస్వామి ఆలయాలకు అనుసంధానంగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన టూరిజం భవనానికి మరమ్మతుల కోసం నిధు­లు మంజూరు చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement