
తాడేపల్లి - మహిళలకు ఫ్రీ బస్సు అంటూ ఎన్నికలకు ముందు కూటమి నేతలు ప్రకటించిన పథకం పచ్చి మోసమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించొచ్చని చెప్పారని, ఇప్పుడు నిబంధనలు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ రోజు(సోమవారం, ఆగస్ట 11వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పుత్తా శివశంకర్..‘మొదటి ఏడాది స్త్రీ శక్తి పథకాన్ని ఎగ్గొట్టారు. రెండవ సంవత్సరం కూడా సగం పూర్తైపోయింది. ప్పుడు కొన్ని రకాల బస్సులు మాత్రమేనని నిబంధనలు పెడుతున్నారు.
రాంప్రసాద్ రెడ్డి మొదటిసారి గెలిచి మంత్రి అయ్యాడు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్టీసీ గురించి పట్టించుకోలేదు. 2019 నవంబర్ నాటికి ఆర్టీసీ రూ. 7629 కోట్ల నష్టాల్లో ఉంది. తొలిసారి సీఎం అయిన జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ భద్రత కల్పించారు. మహిళలకు ఫ్రీ బస్ పేరుతో చంద్రబాబు, పవన్ ,నారా లోకేష్ ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు.
అన్ని పుణ్య క్షేత్రాలను రూపాయి ఖర్చు లేకుండా సందర్శించవచ్చన్నారు. ఎవరైనా టికెట్ అడిగితే నా పేరు చెప్పమని చంద్రబాబు ఊదరగొట్టాడు. నేనే సేఫ్ డ్రైవర్ అని చంద్రబాబు ప్రచారం చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆ పథకం ఏమైంది..?’ అంటూ నిలదీశారు. పుణ్య క్షేత్రాలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లొచ్చని ఎన్నికలకు ముందు చెప్పారని, తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సర్వీసులో కూడా టికెట్ తీసుకోవాలనే నిబంధన పెట్టడం దారుణమని పుత్తా శివశంకర్ విమర్శించారు.