'దిశ' గురించి ప్ర‌చారం చేయాలి

YS Jagan Mohan Reddy Review Meeting With officials On Disha Act - Sakshi

త్వ‌ర‌లో దిశ పెట్రోల్స్ ప్రారంభం

11 ల‌క్ష‌ల డౌన్‌లోడ్లు దాటిన దిశ యాప్‌

దిశ చ‌ట్టం కింద మొత్తం 390 కేసులు

వేగంగా ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటు

‘దిశ’ చట్టం అమలుపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: మ‌హిళ‌లు, చిన్నారులపై నేరాల‌కు సంబంధించి విచార‌ణ‌కు ప్ర‌త్యేక కోర్టులు త్వ‌ర‌గా ఏర్పాట‌య్యేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. అయితే దీనికి సంబంధించిన ఫైలు కేంద్ర హోం శాఖ వ‌ద్ద పెండింగులో ఉంద‌ని అధికారులు చెప్ప‌గా.. కేంద్ర ప్ర‌భుత్వంతో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సీఎం సూచించారు. క్రిమిన‌ల్ లాలో స‌వ‌ర‌ణలు చేస్తూ పంపిన బిల్లుకు ఆమోదం వ‌చ్చేలా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. గురువారం సీఎం జ‌గ‌న్‌ 'దిశ' చ‌ట్టం అమ‌లుపై స‌మీక్ష నిర్వ‌హించారు. దిశ చట్టాన్ని సమర్థవంతగా అమలు చేయాలని పేర్కొన్నారు. దిశ యాప్‌ కింద వచ్చే ఫిర్యాదులకు క్వాలిటీ సేవలు అందాలని స్పష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ సహా ప‌లువురు అధికారులు హాజరయ్యారు. 

వీలైనంత త్వ‌ర‌గా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి
ఈ సంద‌ర్భంగా ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకంపైనా సీఎం జ‌గ‌న్ ఆరా తీశారు. దిశ చట్టం కింద కేసుల విచారణకు 13 జిల్లాల్లో 11 మంది ప్రాసిక్యూటర్లు, పోక్సో కేసుల విచారణకు 8 మంది ప్రాసిక్యూటర్లను ప్రత్యేకంగా నియమించామని అధికారులు తెలియ‌జేశారు. దీంతో మిగిలిన చోట్ల కూడా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను త్వరగా నియమించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. దిశ చట్టం, యాప్, నంబర్లకు సంబంధించిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు, ప్రజలు ఎక్కువగా వచ్చి పోయే ప్రాంతాలు, వారు సమావేశమయ్యే చోట్ల పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. అలాగే వీలైనంత త్వ‌ర‌గా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాలు చేయాల‌ని ఆదేశించారు. (యువ‌తిని కాపాడిన 'దిశ' యాప్)

త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏపీ ప్ర‌భుత్వం దిశ పెట్రోల్‌ను ప్రారంభించనుంది. అందులో భాగంగా 900 స్కూటర్లను ఏర్పాటు చేసింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో దిశ మహిళా హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు చేయ‌నున్నారు. ప్రత్యేకంగా కంప్యూటర్, ఫోన్‌ నంబర్‌ ఏర్పాటు కానుంది. ఇక్క‌డ‌ సైకాలజిస్ట్, ఎన్జీఓ సహా న్యాయ సహాయం కూడా లభిస్తుంది. (మహిళల రక్షణ కోసం ఈ–రక్షాబంధన్‌కు శ్రీకారం)

దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
మ‌రోవైపు దిశ యాప్ 11 లక్షల డౌన్‌లోడ్లు పూర్తి చేసుకుంది. ఈ యాప్ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు 502 కాల్స్, 107 ఎఫ్‌ఐఆర్‌లు నమోద‌య్యాయి. దిశ చ‌ట్టం కింద మొత్తం 390 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 7 రోజుల్లోపు ఛార్జి షీటు దాఖలు కాగా 74 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. ఇందులో మరణ శిక్షలు 3, జీవితఖైదు 5, 20 సంవత్సరాల శిక్ష 2, 10 సంవత్సరాల శిక్ష 5, ఏడేళ్లపైన 10, 5 సంవత్సరాలలోపు శిక్షలు మిగతా కేసుల్లో విధించారు. మ‌రో 1130 కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేసిన‌ప్ప‌టికీ, ఇంకా కేసు నంబర్లు రావాల్సి ఉంద‌ని అధికారులు తెలిపారు. కోవిడ్‌ కారణంగా కోర్టుల కార్యకలాపాలపై ప్రభావం చూపిందద‌న్నారు. సైబర్‌ మిత్ర ద్వారా 265 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. ('వైఎస్సార్‌ చేయూత' పథకాన్ని ప్రారంభించిన సీఎం‌ జగన్‌)

27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
సామాజిక మాధ్య‌మాల ద్వారా వేధింపులు ఆపడానికి సైబర్‌ బుల్లీ వాట్సాప్‌ నంబర్ అందుబాటులో ఉంది. ఇందులో ఇప్పటి వరకూ 27 వేల ఫిర్యాదులు వచ్చాయి. 780 మంది తరచుగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని గుర్తించ‌గా వీరందరిపైనా కేసులు నమోదు చేశారు. సైబర్‌ నేరాలు, సైబర్‌ చట్టాలపైనా అవగాహన కల్పించే ఈ-రక్షా బంధన్‌లోని ప్ర‌త్యేక‌‌ కార్యక్రమంలో 3.5 లక్షల మంది పాల్గొన్నారు. దిశ వ‌న్‌‌ స్టాఫ్‌ సెంటర్లు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయ‌ని అధికారులు తెలిపారు. ఈ సెంట‌ర్లు 13 జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో పెట్టామన్నారు. జనవరి నుంచి ఆగస్టు వరకూ 2285 కేసులు వ‌న్‌‌స్టాప్‌ సెంటర్లకు వచ్చాయని అధికారులు వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top