గంగపుత్రులకు వెన్నుదన్నుగా | YS Jagan Mohan Reddy Released Rs 4913 crore under the YSR Matsyakara Bharosa scheme | Sakshi
Sakshi News home page

గంగపుత్రులకు వెన్నుదన్నుగా

Apr 15 2026 5:45 AM | Updated on Apr 15 2026 5:45 AM

YS Jagan Mohan Reddy Released Rs 4913 crore under the YSR Matsyakara Bharosa scheme

జగన్‌ ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా మత్స్యకార భరోసా

భృతి కింద 5.38 లక్షల మందికి రూ.538 కోట్ల సాయం

డీజిల్‌పై లీటరుకు సబ్సిడీ రూ.6.03 నుంచి రూ.9కు పెంపు

23 వేల బోట్లకు రూ.148 కోట్ల మేర ప్రయోజనం

ఐదేళ్లలో వివిధ పథకాలతో మత్స్యకారులకు మొత్తం రూ.4913 కోట్ల మేర లబ్ధి 

సాక్షి, అమరావతి: వేటకు వెళ్తేగానీ పూట గడవని గంగపుత్రులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచిందని మత్స్యకారులు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్‌ చేయూత, ఆసరా, జగనన్న ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణం.. ఇలా ప్రతి సంక్షేమ పథకం ద్వారా గత ప్రభుత్వంలో తాము లబ్ధి పొందామని పేర్కొంటున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏటా క్రమం తప్పకుండా అందించిన వేట నిషేధ భృతి (మత్స్యకార భరోసా), ఆయిల్‌ సబ్సిడీ పెంపుతో వేటకు వెళ్లే బోట్ల సంఖ్య, వేటపై ఆధారపడి జీవనోపాధి పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.  

ఐదేళ్లు క్రమం తప్పకుండా.. 
ఎన్నికల హామీ మేరకు 2019లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చీ రాగానే మత్స్యకారులకు వేట నిషేధ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచడమే కాదు.. ఆరంభంలోనే నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా నిషేధ భృతిని అందించి వారికి అండగా నిలిచారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్‌ బోట్లకే కాదు.. తెప్పలు, ఇతర సంప్రదాయ పడవలపై వేట సాగించే వారికి సైతం సాయాన్ని అందజేసిన ఘనత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికే దక్కింది.

2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఏటా సగటున 60 వేల మంది మాత్రమే లబ్ధి పొందితే 2019–24 మధ్య  వైఎస్‌ జగన్‌ హయాంలో 5.38 లక్షల మందికి రూ.538 కోట్లకుపైగా భృతిని అందజేశారు. గతంలో డీజిల్‌పై లీటర్‌కు రూ.6.03 చొప్పున సబ్సిడీ ఇవ్వగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.9కు పెంచింది. వేటకు వెళ్లే్టప్పుడు సబ్సిడీని మినహాయించుకుని ఆయిల్‌ నింపుకొనే వెసులుబాటు కల్పించారు.

2014–19 మధ్య 1,100 బోట్లకు మాత్రమే ఆయిల్‌ సబ్సిడీని వర్తింప చేస్తే.. 2019–24 మధ్య ఈ సంఖ్య ఏకంగా 23,209కి పెరిగింది. ఆయిల్‌ సబ్సిడీ ద్వారా రూ.148 కోట్ల మేర లబ్ధి  చేకూర్చారు. ఇక 50 ఏళ్ల పైబడిన మత్స్యకారులకు ఇస్తున్న పింఛన్‌ 2018–19 నాటికి 42,729 మందికి వర్తింప చేయగా 2019–24 మధ్య ఏకంగా 69,741 మందికి అందచేశారు. టీడీపీ హయాంలో పింఛన్‌ కోసం రూ.51.57 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.759.47 కోట్లు వెచ్చించింది. 

పరిహారం రెట్టింపు.. 
చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ఆదుకుంది. 2019–24 మధ్య 175 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.16.87 కోట్ల పరిహారాన్ని అందజేసింది. మరోవైపు డాక్టర్‌ కోనసీమ అంబేడ్కర్‌ జిల్లాలో జీఎస్‌పీసీ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్‌జీసీ పైపులైన్‌ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు రూ.647.44 కోట్లు సాయాన్ని అందించారు. వివిధ పథకాల ద్వారా ఐదేళ్లలో గత ప్రభుత్వం రూ.4,913 కోట్ల మేర మత్స్యకారులకు లబ్ధి చేకూర్చింది.

గత ప్రభుత్వంలో ఏపీకి అవార్డులు..
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ తోడ్పాటుతో మత్స్య ఉత్పత్తుల దిగుబడులు 39.92 లక్షల టన్నుల (2018–19లో) నుంచి 51.58 లక్షల టన్నులకు (2023–24లో) చేరాయి. 2019–24 మధ్య జాతీయ స్థాయిలో 19.37 శాతం వృద్ధి రేటు నమోదైతే.. ఏపీలో 23.28 శాతంగా నమోదైంది. డొమెస్టిక్‌ ఫిష్‌ మార్కెటింగ్‌కు స్కోచ్‌ అవార్డుతో పాటు 2021–22, 2023–24లలో రాష్ట్రానికి బెస్ట్‌ మెరైన్‌ స్టేట్‌ అవార్డులు దక్కడం గమనార్హం.

చంద్రబాబు, కూటమి వచ్చాక ఆ భరోసా మచ్చుకైనా కానరావడం లేదని మత్స్య కారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా రూ.20 వేల చొప్పున మత్స్యకార భరోసా ఇస్తామని హామీ ఇచి్చన చంద్రబాబు ప్రభుత్వం తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టిందని, రెండో ఏడాది అరకొరగా విదిలించి చేతులు దులుపుకొందని మండిపడుతున్నారు. ఇక డీజిల్‌ సబ్సిడీ ఎప్పుడిస్తున్నారో తెలియని దుస్థితి నెలకొంది. ఆయిల్‌ కంపెనీలు డీజిల్‌పై లీటర్‌కు రూ.24 మేర పెంచిన భారాన్ని తగ్గించాలని మొర పెట్టుకున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెన్నుదన్నుగా నిలిచారు.. 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు జరిగినంత మేలు గతంలో ఎప్పు­డూ జరగలేదు. ఫిషింగ్‌ హార్బర్లు, పోర్టులు, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటుతో మత్స్యకారుల జీవన ప్రమా­ణాలు మెరుగు పర్చేందుకు బాటలు వేశారు. ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మత్స్యకార భరోసా అందించి వెన్నుదన్నుగా నిలిచారు. చేయూత, ఆసరా, ఫీజు రీయింబర్సుమెంట్, ఆరోగ్యశ్రీ, ఇళ్ల­పట్టాలు, ఇళ్లు.. ఇలా ప్రతీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు.  –వాసుపల్లి జానకీరామ్, ఈస్ట్‌ కోస్ట్‌ మెకనైజ్డ్‌ ఫిషింగ్‌ బోట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు  

ఏ ఒక్క పథకం లేదు.. 
గత ప్రభుత్వంలో మత్స్యకారులకు మ­హర్దశ. నేడు మమ్మల్ని పట్టించుకునేవారు కరువయ్యారు. తొలి ఏడాది వేట నిషేధ భృతి ఎగ్గొట్టారు. మత్స్యకారులకు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కావడం లేదు. కొత్తగా మత్స్యకార పింఛన్లు మంజూరు చేయడం లేదు. బతుకు భారంగా తయారైంది. –చోడిపల్లి శ్రీను, మత్స్యకారుడు, పాయకరావుపేట 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement