భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
పులివెందుల పర్యటనలో భాగంగా భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహణ
సాక్షి ప్రతినిధి, కడప: ‘రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్‌సీపీ నేతలు చాలెంజ్‌గా తీసుకోవాలి. ప్రతి చోటా నాయకులు కేడర్‌కు అండగా నిలవాలి. అధికార బలం, పోలీసులను అడ్డుపెట్టుకొని ఏకగ్రీవాలు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలి’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు.
పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వినతులు సమర్పించారు. వైఎస్ జగన్ వారి సమస్యలను ఓపికగా విన్నారు. వారికి భరోసా ఇచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే సిద్ధం కావాలి
అనంతరం పార్టీ నాయకులతో వైఎస్ జగన్ మాట్లాడారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఒక్కరూ ఛాలెంజ్‌గా తీసుకోవాలని వారికి చెప్పారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని సూచించారు. ఎక్కడా ఏకగ్రీవ ఎన్నికలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో ఉండేలా ముందుగానే సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుని, గ్రామాలు, వార్డులవారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
బెదిరింపులు, దౌర్జన్యాలకు లొంగొద్దు
అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షంపై ఒత్తిళ్లు తీసుకురావడం, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగితే వాటిని ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ సూచించారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రతి కుటుంబానికి కలిగిన మేలును ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ విస్తరణ, విద్యా రంగంలో సంస్కరణలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించండి
ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు భిన్నంగా కూటమి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు.
ప్రజల మధ్యే ఉండాలని, వారి సమస్యలపై పోరాడాలని, వైఎస్సార్‌సీపీ పాలనలో వారికి జరిగిన మంచిని గుర్తు చేయాలని చెప్పారు. అలా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం అతి సునాయాసమని తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని నిరంతరం కొనసాగించాలని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసి, ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందేలా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు.
పోలీసుల వైఖరిపై వైఎస్ జగన్ ఆగ్రహం
వైఎస్ జగన్ భాకరాపురం క్యాంపు కార్యాలయానికి వచ్చిన సమయానికి ఆయన్ని కలిసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే వారెవ్వరూ క్యాంపు కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు మెయిన్ గేట్లు మూయించి, అడ్డుకోవడంతో వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం ప్రాంగణంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. గేట్లు తెరవాలంటూ వాహనంలో నుంచే ఆదేశించారు. పోలీసులు గేట్లు తెరవడంతో బయట గంటల తరబడి వేచి ఉన్నవారంతా కార్యాలయంలోకి వచ్చారు.
పులివెందులలో ఘన స్వాగతం
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంగళవారం పులివెందులలో ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 11.50 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరకున్న ఆయనకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మంత్రి ఎస్‌బి అంజాద్‌బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి, చవ్వా దుష్యంత్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పూల శ్రీనివాసులరెడ్డి, కల్లూరు నాగేంద్రరెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్‌ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, రాజోలి వీరారెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అంబటి సురేష్‌ను పరామర్శిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
అంబటి సురేష్ కుటుంబానికి అండగా ఉంటాం
టీడీపీ నేతల దాడులకు భయపడాల్సిన అవసరం లేదు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం పట్టణంలో ఇటీవల టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసి, దాడి చేసిన వైఎస్సార్‌సీపీ కమలాపురం వాణిజ్య విభాగం అధ్యక్షుడు, ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన అంబటి సురేష్ , ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలిశారు.
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్‌రెడ్డి వారిని వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. సురేష్ , ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైఎస్ జగన్ ఘటన వివరాలను తెలుసుకున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే పుత్తా నరసింహారెడ్డి అనుచరులు ఆరోజు తనపై చేసిన దౌర్జన్యాన్ని వైఎస్ జగన్‌కు సురేష్ వివరించారు. కమలాపురంలో ఆర్వోబీ నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని గట్టిగా డిమాండ్ చేసినందుకే టీడీపీ ఎమ్మెల్యే పుత్తా అనుచరులు నడిరోడ్డుపైనే ఆటోలో కిడ్నాప్ చేసి, దాడి చేసి, ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్బంధించారని తెలిపారు. ఆటోలో తీసుకెళ్తూ తనపై దాడి చేశారని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ కమలాపురం ఇన్‌ఛార్జి నరేన్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ కార్యాలయానికి బయల్దేరడంతో తనను విడిచిపెట్టారని సురేష్ తెలిపారు.
సురేష్ కుటుంబానికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు, దాడులు ఎదురైనా భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలు, ప్రజలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష కార్యకర్తలు, సామాన్య ప్రజలను బెదిరించే ప్రయత్నాలు జరిగితే పార్టీ వారికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.


