పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న వైఎస్ జగన్
శాసనసభ ప్రాంగణంలో విగ్రహం ఏర్పాటు చేస్తాం
బ్రాహ్మణ సంఘం విజ్ఞప్తిపై వైఎస్ జగన్ హామీ
ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు స్మృతివనం, విగ్రహం ఏర్పాటుపై వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులలో దక్షిణ భారతావనిలో ప్రకాశం పంతులు అగ్రగణ్యులని, అలాంటి మహానీయుడి జీవిత విశేషాలు భావితరాల వారికి తెలియజేసేలా రాష్ట్ర రాజధానిలో ప్రకాశం స్మృతివనం, శాసనసభ ప్రాంగణంలో ప్రకాశం పంతులు విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని తప్పక పరిశీలించి.. అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో వైఎస్ జగన్‌కు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జ్వాలాపురం శ్రీకాంత్, ద్రోణంరాజు శ్రీవాత్సవ, రాంపల్లి రవిచంద్ర, పురుషోత్తమ శర్మ, ఈ.క్రిష్ణమాచారి, సీహెచ్.శ్రీనివాసరావు, కె.వెంకట సుబ్బారావు పాల్గొన్నారు.
నేటి తరాలకు స్ఫూర్తిదాయకం
అలాగే ప్రకాశం పంతులుకు నివాళులర్పిస్తూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. బ్రిటిష్ పాలకుల అణచివేతకు భయపడకుండా, వారి తుపాకులకు తన ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆయన. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం. బుధవారం టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’ అంటూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.


