బెడ్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. సవతి తల్లి పనేనా?

Young Woman Died Burnt In Fire At Tanuku - Sakshi

తణుకు (పశ్చిమ గోదావరి) : తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో ఓ యువతి సజీవ దహనం ఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న గ్రామానికి చెందిన ముళ్లపూడి నాగహారిక (19) ఇంట్లో బెడ్‌రూమ్‌లో మంచంపైనే సజీవ దహనం అయ్యింది. అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా హత్య చేసి కాల్చివేశారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. 

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్, రూపరాణి దంపతుల కుమార్తె నాగహారిక శుక్రవారం రాత్రి తన గదిలో నిద్రించింది. తెల్లారేసరికి నాగహారిక మంచంపై కాలి బూడిదై కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగహారికకు రూపరాణి సవతి తల్లికాగా ఆమెకు తొమ్మిదేళ్ల మంజలిప్రియ అనే కుమార్తె ఉంది. ఇటీవల నూతనంగా ఇల్లు నిర్మించుకున్న వీరు మూడు నెలల క్రితం గృహప్రవేశం చేశారు. 

అయితే పూర్తిస్థాయిలో ఇంటి సామగ్రి తెచ్చుకోకపోవడంతో యజమాని ముళ్లపూడి శ్రీనివాస్‌ పాత ఇంటివద్దనేనిద్రిస్తున్నారు. శనివారం ఉదయం కొత్త ఇంటికి వచ్చి భార్యను నిద్రలేపే సమయంలో కుమార్తె నిద్రిస్తున్న గది నుంచి పొగలు రావడం గమనించారు. అప్పటికే నాగహారిక మంటల్లో కాలిపోయింది. తండ్రి ముళ్లపూడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ సీఐ సీహెచ్‌ ఆంజనేయులు, ఎస్సై రాజ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్‌ సిబ్బంది, డాగ్‌స్కా్వడ్‌ ఘటనా స్థలంలో పలు ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు నాగహారిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.     
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top