సభకు రాకుంటే సంక్షేమ పథకాలు కట్‌ | Welfare schemes will be cut if TDP does not come to the assembly | Sakshi
Sakshi News home page

సభకు రాకుంటే సంక్షేమ పథకాలు కట్‌

Sep 10 2025 6:21 AM | Updated on Sep 10 2025 10:21 AM

Welfare schemes will be cut if TDP does not come to the assembly

సూపర్‌సిక్స్‌ సభా ప్రాంగణం వద్ద భారీఎత్తున మోహరించిన పోలీసులు

రైతులపైనా ఆంక్షలు..ఉద్యోగులకు చుక్కలు 

చంద్రబాబు సభతో ప్రయాణికులకు తిప్పలు 

అనంతపురం పొడవునా ఎన్‌హెచ్‌–44 బంద్‌ 

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బళ్లారి వెళ్లేవారికి అవస్థలు 

కిలోమీటర్ల కొద్దీ దూరాన్ని చుట్టి రావాల్సిన దుస్థితి

అనంతపురం: ‘సంక్షేమ పథకాలు తీసుకునేవారు సీఎం చంద్రబాబు సభకు హాజరు కావాలి. అలా వస్తేనే  పథకాలు కొనసాగుతాయి..’ ఇది అనంతపురం జిల్లాలోని గ్రామాల్లో వేసిన చాటింపు. బుధవారం అనంతలో ‘సూపర్‌ సిక్స్‌–సూపర్‌ హిట్‌’ పేరిట ప్రభుత్వం భారీ సభ తలపెట్టింది. దీనికి చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడచూసినా కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు, పోలీసుల హడావుడే..! ఐదు కిలోమీటర్ల దూరం నుంచే బస్సులు, భారీ వాహనాల మళ్లింపు, నగరంలో విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలు ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి.

సభ ఏర్పాట్ల పేరిట ఇబ్బంది పెడుతుండడంతో ప్రజలు మండిపడుతున్నారు. బెంగళూరుకు వెళ్లే రోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అనంతపురం నుంచి వడియంపేట–బుక్కరాయసముద్రం–నాయనపల్లి క్రాస్‌–నార్పల–ధర్మవరం–ఎన్‌ఎస్‌ గేట్‌ మీదుగా వాహనాలను మళ్లించడంతో 100–120 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. నార్పల నుంచి బత్తలపల్లికి వెళ్లే మార్గం సరిగా లేదు. వాహనాల రద్దీ పెరగడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కియా కంపెనీ ఉద్యోగులు అనంతపురం నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా.. చంద్రబాబు సభ పుణ్యమాని ఏకంగా 150 కిలోమీటర్ల దూరం చుట్టి వెళ్లాల్సి వస్తోంది. 

అనంతపురం శివారు కక్కలపల్లి టమాట మండీలకు నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మండీలకు సమీపాన జాతీయ రహదారి–44 పక్కనే సీఎం సభకు ఏర్పాట్లు చేశారు. దీంతో మంగళవారం రాత్రి నుంచే వాహన రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ టమాట వాహనాలను ఆపి పంపుతున్నారు. కక్కలపల్లి మండీ సమీపంలోకి వెళ్లడానికి వీల్లేకుండా చేశారు. టమాట వాహనాలను తిప్పి పంపుతుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇక నగర వీధులను ఫ్లెక్సీలతో నింపేశారు. సామాన్యులు రోడ్డుపై తిరగలేని పరిస్థితి కల్పించారు. దీనినితోడు నగరంలోనూ వాహన సంచారంపై పోలీసులు ఆంక్షలు విధించడం విమర్శలకు తావిస్తోంది. 

సభకు రాకుంటే పథకాల కోత! 
ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంగళవారం వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘అన్నదాత పోరు’ విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనం. ఇక చంద్రబాబు సభలకు స్పందన లేకపోవడంతో జన సమీకరణకు సరికొత్త డ్రామాలకు తెరలేపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం అచ్చంపల్లిలో చాటింపు వేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర పథకాలు కావాలంటే సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొనాలి. దీపావళి నుంచి ఆడబిడ్డ నిధి ఇస్తారు. చంద్రబాబు సభలో పాల్గొన్నవారికే పథకాలు వస్తాయి’’ అంటూ దండోరా వేయడం విమర్శలకు తావిచ్చింది.  

పాఠశాలలకు సెలవు.. ఉపాధ్యాయుల ఆగ్రహం 
అనంతపురంలో సూపర్‌సిక్స్‌ సభ నేపథ్యంలో బుధవారం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చంద్రబాబు సభకు పాఠశాలల బస్సులు తరలించిన నేపథ్యంలో ప్రైవేటుతో పాటు ప్రభుత్వ పాఠశాలలకూ సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. నేటి సెలవుకు బదులుగా రెండో శనివారం (ఈనెల 13న) అన్ని యాజమాన్యాల పాఠశాలలు పని చేయాల్సి ఉంటుందని డీఈఓలు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement