పెళ్లివారమండీ... ‘విందు’ తెచ్చినామండీ..

Wedding Dinner Parcels To Relatives House - Sakshi

బంధువుల ఇంటికే వివాహ భోజనం పార్శిళ్లు 

కరోనా వేళ పెండ్లి కుమారుడి ఆలోచన 

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): పెళ్లంటే మేళ తాళాలు.. మామిడి తోరణాలు. సందళ్ల ముంగిళ్లు.. పచ్చని పందిళ్లు. మూడు ముళ్లు.. ఏడడుగులు. వీటన్నింటి కళను ఇనుమడించేలా.. బంధుమిత్రుల ఆనందోత్సహాలు. చిరకాలం గుర్తుండిపోయేలా షడ్రసోపేతమైన విందు భోజనాలు. అయితే కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో ఇంత సంతోషం ఆవిరైపోయింది. జీవితాంతం గుర్తుండిపోయే వివాహ వేడుక మొక్కుబడి తంతుగా మారిపోయింది. పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించేలా ఆంక్షలు అమలవుతూ ఉండడంతో పెళ్లికి పప్పన్నం కూడా పెట్టలేని పరిస్థితి తలెత్తింది. అయితే సమస్య ఉన్నప్పుడే చిట్కా కూడా ఉంటుంది కదా.. అందుకే ఇప్పుడు పెళ్లికి కొద్ది మందినే ఆహ్వానిస్తున్నా.. బంధుమిత్రులందరికీ పెళ్లి వేడుక జరిగే రెండు రోజులూ పంచభక్ష్య పరమాన్నాల పార్శిళ్లు పంపే కొత్త సంప్రదాయం మొదలైంది.

 నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఐదు నెలల కిందట వివాహం కుదిరింది. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అప్పుడే పెండ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. జూలై 25న కల్యాణం ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలకు నిర్ణయించుకున్నాయి. ఇంతలో కరోనా ముంచుకొచ్చింది. వ్యాధి విజృంభణ అధికంగా ఉండడంతో ప్రభుత్వం వివాహ వేడుకలకు నిబంధనలు విధించింది. దీంతో ఘనంగా శుభకార్యం చేసుకోవాలనుకున్న ఇరు కుటుంబాల వారు నీరసపడిపోయారు. దగ్గర బంధువులకే చెప్పుకుని మొక్కుబడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వివాహం అనగానే అందరికీ గుర్తొచ్చేంది విందు భోజనం. పది మందికి ఆకులు వేయాలన్న సంప్రదాయాన్ని కొనసాగించాలని పెండ్లి కుమారుడు నిర్ణయించుకున్నాడు.

వివాహానికి ఆహ్వానం పలికిన కొద్ది మందికైనా భోజనం పెట్టాలి.. ఎలా అని ఆలోచించాడు. అందర్నీ పిలిచి భోజనాలు పెట్టేకన్నా.. భోజనాలు తయారు చేసి నేరుగా బంధువుల ఇంటికే పంపిస్తే.. అని ఆలోచించి అమలు చేశాడు. బంధువుల ఇంటికే నేరుగా టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం పంపించే ఏర్పాట్లు చేసుకున్నాడు. వివాహ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అతన్ని పెండ్లి కుమారుడ్ని చేశారు. ముందుగా అనుకున్నట్టే తన కుటుంబ సభ్యులతో ఉదయం 7 గంటలకే బంధువుల ఇంటికి నేరుగా టిఫిన్‌ అందించాడు. మధ్యాహ్నం 11 గంటలకే భోజనం పంపించాడు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో తెలుసుకుని టిఫిన్, భోజనాలు, ప్లేట్లు, స్పూన్, వాటర్‌ బాటిల్, డిన్నర్‌ స్పూన్‌.. పంచభక్ష్య పరమన్నాలన్నీ కలిపి ఓ ప్యాక్‌ చేసి అందించడం విశేషం. ఫలితంగా బంధువులు వారి వారి ఇళ్లల్లోనే పెండ్లి భోజనం తృప్తిగా ఆరగించారు.    

బత్తెం రోజులు గుర్తొచ్చాయి 
మూడు, నాలుగు దశాబ్దాల కిందట బత్తెలు పంచేవారు. ఎటువంటి శుభకార్యం నిర్వహించినా.. సమీప బంధువులు, కుటుంబ సభ్యులకు భోజనాలకు చెప్పుకునేవారు. ఇరుగు పొరుగు వారికి కిలో బియ్యం, పావు కిలో పెసరపప్పు/కందిపప్పు, కాసింత చింతపండు, వంకాయ, బంగాళదుంప.. ఇలా కూరగాయలతో పాటు ఎండుమిర్చి, పోపు దినుసులు ఇచ్చేవారు. కాలం మారింది. బత్తెం రోజులకు స్వస్తి పలికారు. అందరికీ సహపంక్తి భోజనాలు పెట్టేవారు. మారుతున్న కాలంలో సహపంక్తి భోజనాలకు బై.. బై చెప్పారు. బఫే మీల్స్‌ ట్రెండ్‌గా మారింది. నిలబడి తినే రోజులు వచ్చాయి. కరోనా వచ్చింది.. వాటన్నింటిని తిరగ రాసింది.. అసలు భోజనాలు పెట్టుకోవడానికే అవకాశం లేకుండా చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top