పేదరికం లేని సమాజం | We will eradicate poverty with the P4 policy | Sakshi
Sakshi News home page

పేదరికం లేని సమాజం

Dec 14 2024 4:47 AM | Updated on Dec 14 2024 4:47 AM

We will eradicate poverty with the P4 policy

ఇదే స్వర్ణాంధ్ర విజన్‌ 2047 లక్ష్యం.. పీ4 విధానంతో పేదరికాన్ని నిర్మూలిస్తాం 

ముఖ్యమంత్రి చంద్రబాబు  

సాక్షి, అమరావతి:  పేదరికం లేని సమాజం రూపకల్పనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర – 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించినట్లు సీఎం నారా చంద్రబాబునాయుడు చెప్పారు. 2047లో వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరపుకుంటామని, ఆ నాటికి భారతదేశం అగ్రదేశంగా మారాలనే లక్ష్యంతో వికసిత్‌ భారత్‌ – 2047ను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని, ఇందులో భాగంగా రాష్ట్రంలో కూడా స్వర్ణాంధ్ర–2047 డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు తెలిపారు. 

శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ మైదానంలో జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధి­కారులతో కలిసి విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం–మానవ వనరుల అభివృద్ధి,  ఇంటింటికీ నీటి భద్రత, రైతు–వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ (లాజిస్టిక్స్‌), శక్తి–ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత లక్ష్యంగా దీనిని ఆవిష్కరించామని చెప్పారు. 

ప్రస్తుతం రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ రూ.16 లక్షల కోట్లుగా ఉందని, విజన్‌ – 2047 ద్వారా ఇది రూ. 2 కోట్ల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. రూ. 2,49,000 (3 వేల డాలర్లు) కంటే తక్కువగా ఉన్న రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం  2047 నాటికి రూ.34,86,000 (42 వేల డాలర్లు)కు చేరుతుదన్నారు. పీపుల్, పబ్లిక్, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీ 4) విధానం ద్వారా నిరుపేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి  జరు­గుతుందన్నారు.

విజన్‌ 2020 ద్వారా ప్రతి కు­టుంబం నుంచి ఒక కంప్యూటర్‌ ఉద్యోగి వచ్చారని, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా విజన్‌–2047 రూపొందించామని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేలా పాలసీలు తెస్తున్నామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్నారు. పట్టిసీమ తరహాలో నదుల అనుసంధానం చేయడం వల్ల కరువు అనే మాట రాదని, రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉండదని, దక్షిణ భారతంలోనే ఏపీ నంబర్‌ వన్‌ రాష్ట్రంగా మారుతుందని వివరించారు. 

అగ్రీ టెక్‌ విధానాలతో రైతులకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్న­ట్లు తెలిపారు. ఏపీని గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దుతామని,  అన్ని వాహనాలను ఈవీ వాహనా­లుగా తయారు చేయాలని చూస్తున్నట్టు తెలిపారు. 

రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు 
రాబోయే రోజుల్లో రూ. 20 లక్షల కోట్ల నుంచి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావా­లనే ఉద్దేశంతో పని చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పా­రు. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలొచ్చేలా ఈ డాక్యుమెంట్‌ తయారు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో 175 నియోజకవర్గాల్లో 175 పారి­శ్రామిక పార్కులు పెడుతున్నామని తెలిపారు. వీటివల్ల 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. 

ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీతో వల్ల రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.50 లక్షల మందికి ఉపాధి లక్ష్య­మని వివరించారు.  విజన్‌ డాక్యుమెంట్‌పై 17 లక్షల మంది ఆన్‌లైన్లో అభిప్రాయాలు తెలిపారని చెప్పారు.

ఇంకో రెండున్నర దశాబ్దాలు చంద్రబాబు నేతృత్వంలోనే: పవన్‌
ఇంకో రెండున్నర దశాబ్దాలు చంద్రబాబు నేతృతంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. కులం, మతపరంగా విడిపోయే రోజులు పోయాయని, కూటమిలో ఏదైనా సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకుంటామని, అంతేకానీ విడిపోయే ప్రసక్తే లేదని అన్నారు.  శుక్రవారం విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ – 2047 విడుదల సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరమని చెప్పారు. 

తామంతా  ఒకే మాటగా మీ (చంద్రబాబు) వెనుకే ఉంటామని హామీ ఇస్తున్నామన్నారు. పార్టీ పెట్టడం అన్నది ఆత్మహత్యా సదృశ్యం వంటిదని, తాను పార్టీ పెట్టిన తర్వాత నుంచి చంద్రబాబు మీద అభిమానం మరింతగా పెరిగిందని చెప్పారు. తన ముక్కు సూటి తనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనలో  భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement