Vizianagaram: మార్కెట్లో వస్తువులు కొంటున్నారా? వీటిని గమనించకపోతే జేబుకి చిల్లే!

Vizianagaram: Officers Inspection In Kirana Stores And Fmcg Shops - Sakshi

వస్తువుల కొనుగోళ్లలో అప్రమత్తంగా వ్యవహరించాలి 

తూకంలో తేడా వస్తే ఫిర్యాదు చేయాలని అధికారుల సూచన 

అధిక ధరల విక్రయాలపై తూనికలు, కొలతలు శాఖ అధికారుల దాడులు 

మూడేళ్లలో రూ.2 కోట్లకు పైగా స్టాంపింగ్‌ ఫీజు, రూ.1.3 కోట్లకు పైగా కాంపౌండ్‌ ఫీజు వసూలు

సాక్షి,విజయనగరం పూల్‌బాగ్‌: ఏ వస్తువు కొనుగోలు చేయాలనుకున్నా చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. దుకాణాల్లో లభ్యమయ్యే ఘన పదార్థాలను తూకాల్లో, ద్రవ పదార్థాలను కొలతల్లో కొలుస్తారు. వీటికి నిర్దిష్ట ప్రమాణాలుంటాయి. అయితే కొందరు వ్యాపారులు అధిక ధన దాహంతో కొలతల్లో జిమ్మిక్కులు చేస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొలతల్లో ఏ చిన్నపాటి తేడా గమనించినా వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయాలి. లేకపోతే అమ్మకందారుల మోసానికి గురికావాల్సి వస్తుంది.

ఈ క్రమంలో కొనుగోలుదారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న విషయంపై తూనికలు, కొలతల శాఖ అధికారులు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే దుకాణాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు ముమ్మరం చేస్తూ అమ్మకందారుల మోసాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.   జిల్లా వ్యాప్తంగా 13,254 సాధారణ, ఎలక్ట్రానిక్‌ కాటాలు ఉన్నాయి. వాటిని రిపేరు చేసేందుకు 9 మంది లైసెన్స్‌ హోల్డర్స్‌ ఉన్నారు. సాధారణ కాటాలు రెండేళ్లకొకసారి, ఎలక్ట్రానిక్‌ కాటాలను ఏడాదికొకసారి ముద్రలు/సీళ్లు వేయించుకోవాలి. అవి ఏమైనా మరమ్మతులకు గురైతే లైసెన్స్‌ హోల్డర్స్‌ వద్ద రిపేర్‌ చేయించుకోవాలి.  

ఎంఆర్‌పీ కన్నా ఎక్కువకు అమ్మితే చర్యలు.. 
జిల్లాలోని చౌకధరల దుకాణాలు, వే బ్రిడ్జిలు, రైస్‌ మిల్లులు, రైస్‌ షాపులు, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ షాపులు, డిస్పెన్సరీ యూనిట్లు, వాటర్‌ ప్లాంట్లు, పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం దుకాణాలు, స్వీట్స్, బేకరీ, కిరాణా షాపులు, జనరల్‌ స్టోర్స్, పాలు, పాల ఉత్పత్తులు, పరిశ్రమలు, మాన్‌ఫ్యాక్చరింగ్‌ యూనిట్స్‌లలో ఎంఆర్‌పీ రేట్ల కంటే అధికంగా అమ్మకాలు చేపట్టకూడదు.

ఎలక్ట్రానిక్‌ కాటాలు జీరోలో ఉండాలి. మాంసం, చేపల దుకాణాల్లో కాటాలు వేలాడదీసి ఉండాలి. తూకం వేసేటప్పుడు కొనుగోలుదారులు సరిపోయిందా లేదా అనే విషయం గమనించాలి. ఒకవేళ తూకం తక్కువగా ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయాలి. దీనికోసం ఫోన్‌ నంబర్లు 08922–223845, 9398159434, 90000828467ను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.

చదవండి: Writer Padmabhushan: ‘ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top