విశాఖపట్నం ఎయిర్‌పోర్టు.. ప్రయాణికుల రద్దీతో కళకళ

Visakhapatnam international Airport: Air Passengers Crossing Number of 9 Thousand Per Day - Sakshi

రోజుకు 9 వేల సంఖ్యను దాటిన విమాన ప్రయాణికులు

కోవిడ్‌ తర్వాత రెండేళ్లలో ఇదే అత్యధికం

నూరు శాతం ఆక్యుపెన్సీతో పలు విమానాలు

ఎయిర్‌పోర్టుపై పర్యాటక సీజను ప్రభావం మరో కారణం

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి అధికమవుతోంది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య ఊపందుకుంటోంది. కోవిడ్‌ ప్రభావం నుంచి కోలుకుని మళ్లీ పూర్వపు స్థితికి చేరుకుంటోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈనెల 17న ఈ విమానాశ్రయం తొమ్మిది వేల మంది ప్రయాణికుల మైలు రాయిని అధిగమించింది. 2020 మార్చి నుంచి కోవిడ్‌ తొలి, మలి విడతలో తీవ్ర ప్రతాపం చూపింది. దీంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కోవిడ్‌ ఉధృతి తగ్గిన తర్వాత కూడా మునుపటి స్థాయిలో ప్రయాణికులు రాకపోకలు చేయడం లేదు. అందుకనుగుణంగా విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసులను కుదించుకున్నాయి. 

కొన్ని నెలల నుంచి కోవిడ్‌ ప్రభావం తగ్గి, సాధారణ స్థాయికి వచ్చింది. దీంతో దాదాపు రెండున్నరేళ్ల అనంతరం ఈ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీతో కళకళలాడుతోంది. నవంబర్‌ వరకు వీరి సంఖ్య రోజుకు 6,000–7,000 వరకు ఉండగా డిసెంబరు నుంచి అది మరింత పెరుగుతూ వస్తోంది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే చాలా విమానాలు కొన్నాళ్ల నుంచి నూరు శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇలా ఈనెల ఆరంభం నుంచి రోజుకు 7000–9000 మంది ప్రయాణికుల సంఖ్య నమోదవుతోంది. శనివారం 9,183 మంది ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించారు. వీరిలో దేశీయ ప్రయాణికులు 8,838 మంది, అంతర్జాతీయ ప్రయాణికులు 345 మంది ఉన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఇదే సమయానికి ఒకే రోజు గరిష్టంగా ఎనిమిది వేల మంది ప్రయాణించారు. 

ఈ విమానాశ్రయం నుంచి సగటున రోజుకు 56 విమాన సర్వీసులు (రానుపోను) రాకపోకలు సాగిస్తున్నాయి. కోవిడ్‌ రెండో దశ తర్వాత ఈ విమానాశ్రయం నుంచి గత డిసెంబర్‌ నెల మొత్తమ్మీద 2.5 లక్షల మంది వెళ్లి వచ్చారు. అయితే 2022 జనవరి నుంచి ఒమిక్రాన్‌ బెడదతో మార్చి వరకు విమాన ప్రయాణాలు నెలకు సగటున ఆరేడు వేలతో రెండు లక్షలలోపే నమోదయ్యాయి.  


కోవిడ్‌కు ముందు ఇలా.. 

కోవిడ్‌కు ముందు 2018–19లో ఈ విమానాశ్రయం నుంచి 28 లక్షల మంది, 2019–20లో 27 లక్షల మంది, 2020–21లో 16 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు జరిపారు. ఈ ఏడాది వీరి సంఖ్య 23 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల తాకిడి కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితికి వస్తుందని భావిస్తున్నట్టు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్‌ కె.శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. దేశ, విదేశాల నుంచి విశాఖకు ఈ శీతాకాలం సీజనులో పర్యాటకులు అధికంగా వస్తుండడం, కోవిడ్‌ తీవ్రత తగ్గడం విమాన ప్రయాణికుల తాకిడి పెరగడానికి దోహదపడుతోందని ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు డీఎస్‌ వర్మ ‘సాక్షి’కి తెలిపారు. (క్లిక్ చేయండి: సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top