హీరోయిన్‌ కల.. సైబర్‌ క్రైమ్‌ కథ | Visakhapatnam criminal cheats on Telangana doctor wife | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ కల.. సైబర్‌ క్రైమ్‌ కథ

May 29 2026 5:19 AM | Updated on May 29 2026 5:19 AM

Visakhapatnam criminal cheats on Telangana doctor wife

సాక్షి, విశాఖపట్నం: మనలో ఉన్న ఆశ, అత్యాశ, బలహీనతలే సైబర్‌ నేరగాళ్లకు అసలు పెట్టుబడిగా మారుతున్నాయి. ఒకప్పుడు భయపెట్టి దోచుకున్న సైబర్‌ క్రిమినల్స్‌.. ఇప్పుడు అత్యాశను అడ్డం పెట్టుకొని అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ డాక్టర్‌ భార్యకు సంబంధించిన సైబర్‌ నేర వ్యవహారం కూడా ఇదే తరహాలో జరిగింది. ఆమెకు టీవీ సీరియల్స్‌ అంటే పిచ్చి, నటన అంటే ప్రాణం. ఇంకేముంది.. ఈ విషయం తెలుసుకున్న ఓ సైబర్‌ నేరగాడు, టీవీ సీరియల్స్‌లో అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మించి, ఆమె నుంచి రూ. 60 లక్షలకు పైగా గుంజుకున్నాడు. ఈ వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శించి బాధితులనే పక్కదారి పట్టించాలనుకున్న కంచరపాలెం పోలీసులు.. చివరికి అసలు విషయం తెలిసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సి వచ్చింది. ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా తరహాలో ఈ సైబర్‌ కథా చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ట్విస్టుల మీద ట్విస్టులతో నడిచింది.

బుల్లితెర నటిని చేస్తానంటూ వల
తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణు­గూరుకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ భార్యకు సోషల్‌ మీడియా వేదికగా విశాఖలోని మధురవాడ వాంబే కాలనీకి చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్‌ అనే నేరగాడు పరిచయమయ్యాడు. ఆమె ఇష్టాయిష్టాలను తెలుసుకున్న వరప్రసాద్‌.. సీరియల్‌ నటికి ఉండాల్సిన అర్హతలన్నీ ఆమెకు ఉన్నాయంటూ పొగడటం ప్రారంభించాడు. తనకు తెలిసిన డైరెక్టర్ల సాయంతో టీవీ సీరియల్స్‌లో అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. ఒక ప్రముఖ చానల్‌లో త్వరలో ప్రారంభంకానున్న ఓ సీరియల్‌లో మంచి పాత్ర ఇప్పిస్తానని నమ్మించాడు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు, సదరు సంస్థకు డబ్బులు ముట్టజెబితే నటించే అవకాశం వెంటనే వచ్చేస్తుందంటూ ఆశపెట్టాడు. నటనపై ఉన్న పిచ్చితో ఆమె విడతల వారీగా దాదాపు రూ. 60 లక్షల వరకూ చెల్లించింది. డాక్టర్‌ భార్యను పూర్తిగా నమ్మించి, ఆమె బ్యాంక్‌ ఖాతా వివరాలను తెలుసుకున్న నేరగాడు లక్ష్మీ వరప్రసాద్‌.. ఆ ఖాతాలోని భారీ మొత్తాన్ని తన విలాసాలకు వాడుకున్నాడు. కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న మురళీనగర్‌లోని ఒక కార్ల షోరూమ్‌ నుంచి రూ. 22 లక్షలకు పైగా విలువైన లగ్జరీ కారును కూడా కొనేశాడు. దీని కోసం డాక్టర్‌ భార్యకు చెందిన క్యాథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి రూ. 22,43,083 లను నేరుగా ఆ కార్ల షోరూం బ్యాంకు అకౌంట్‌కు మళ్లించేశాడు.

మోసం గ్రహించి పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
లక్షలు గుంజుతున్నా సీరియల్‌ అవకాశం విషయంలో మాట మారుస్తుండటంతో, తాను మోసపోయానని సదరు డాక్టర్‌ భార్య ఆలస్యంగా గ్రహించింది. వెంటనే ఆమె తెలంగాణలోని మణుగూరు సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం బ్యాంక్‌ లావాదేవీలను పరిశీలించిన తెలంగాణ పోలీసులు నేరానికి వాడిన సొమ్ము జమయిన విశాఖలోని కార్ల షోరూం బ్యాంక్‌ ఖాతాను సీజ్‌ చేశారు. దీంతో ఆందోళనకు గురైన కార్ల షోరూం యజమాని విశాఖలోని కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కార్ల షోరూం ప్రతినిధులు ఫిర్యాదు చేసిన వెంటనే విశాఖ పోలీసులు కేసు నమోదు చేయకుండానే, హుటాహుటిన ఒక ఏఎస్‌ఐ స్థాయి అధికారిని విశాఖ నుంచి నేరుగా తెలంగాణ­లోని డాక్టర్‌ నివాసానికి పంపించారు. కారు షోరూంకు తక్షణమే డబ్బులు చెల్లించాలంటూ డాక్టర్‌ దంపతులను ఆ అధికారి బెదిరించినట్లు సమాచారం. 

తాము అసలైన బాధితులమని నెత్తీనోరు బాదుకుంటున్నా కనీసం పట్టించుకోలేదని వైద్య దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కంచరపాలెం పోలీసులు బెదిరింపులకు దిగడంతో డాక్టర్‌ దంపతులు గట్టిగా ఎదురు­తిరిగారు. తాము నిందితులం కాదని, బాధితులమని, ఇప్పటికే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారే దర్యాప్తులో భాగంగా ఈ అకౌంట్లను ఫ్రీజ్‌ చేశారని గట్టిగా వాదించారు. తమ వద్ద ఉన్న కేసు వివరాలను, ఎఫ్‌ఐఆర్‌ డాక్యుమెంట్లను వైజాగ్‌ పోలీసులకు చూపించారు. అక్కడ అప్పటికే కేసు నమోదై దర్యాప్తు జరుగుతోందని గ్రహించిన వైజాగ్‌ పోలీసులు ఇక చేసేదేమీ లేక తెలంగాణ నుంచి వెనుదిరిగారు. తెలంగాణ పోలీసుల దర్యాప్తు స్పీడుకు, డాక్టర్‌ దంపతుల రివర్స్‌ ఎటాక్‌కు షాకైన కంచరపాలెం పోలీసులు వైజాగ్‌ చేరుకున్నాక అధికారికంగా కేసు నమోదు చేశారు. కార్ల షోరూం యజమాని ద్వారా లిఖితపూర్వక ఫిర్యాదు తీసుకు­న్నారు. ప్రధాన నిందితుడు జంబాడ లక్ష్మీ వరప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement