వామ్మో.. అలాంటి గాలి పీలుస్తున్నామా? | Is Visakhapatnam air safe Shocking Report Out | Sakshi
Sakshi News home page

వామ్మో.. అలాంటి గాలి పీలుస్తున్నామా?

May 29 2026 11:32 AM | Updated on May 29 2026 11:36 AM

Is Visakhapatnam air safe Shocking Report Out

విశాఖ నగరవాసులు తమకు తెలియకుండానే ప్రమాదకర వాతావరణంలో జీవిస్తున్నారా? రోజురోజుకీ క్షీణిస్తున్న గాలి నాణ్యత నగరాన్ని నెమ్మదిగా “పాల్యూషన్ హాట్‌స్పాట్”గా మారుస్తోందా? అసలు ప్రజలు పీలుస్తున్న గాలి నిజంగానే సురక్షితమేనా? తాజాగా వెలువడిన ఒక నివేదిక ఈ ప్రశ్నలకు ఆందోళనకర సమాధానాలు ఇచ్చింది. విశాఖ ప్రజలు దాదాపు ప్రతి 10 రోజుల్లో 7 రోజులు కలుషితమైన గాలినే పీలుస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది.

“రిస్పిరర్ లివింగ్ సైన్సెస్” సంస్థ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు సంవత్సరాలుగా వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని నివేదిక స్పష్టం చేసింది. గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మానిటరింగ్ స్టేషన్ ఆధారంగా సేకరించిన డేటా ప్రకారం.. 2026 జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో 70.68 శాతం రోజుల్లో PM10 స్థాయులు భారత జాతీయ భద్రతా పరిమితిని మించిపోయాయి.

PM10.. పీఎంఅంటే గాలిలో తేలే సూక్ష్మ ధూళి కణాలు. ఇవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో గత రెండేళ్లలో నైట్రోజన్ డైఆక్సైడ్ (NO2) స్థాయిలు 34 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. వాహనాల పొగ, పరిశ్రమల ఉద్గారాల వల్లే ఈ పెరుగుదల కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

నివేదికలో మరింత షాకింగ్ అంశం ఏమిటంటే.. 2026లో PM10 వార్షిక సగటు 139.59 మైక్రోగ్రామ్స్/క్యూబిక్ మీటర్‌గా నమోదైంది. ఇది జాతీయ ప్రమాణాల కంటే రెండింతలకు పైగా అధికం. అంతేకాదు, జీవీఎం కార్పొరేషన్ మానిటరింగ్ స్టేషన్ పరిధి వరుసగా మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ఒకటిగా నమోదవుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా కూడా పరిస్థితి మెరుగ్గా లేదని నివేదిక పేర్కొంది. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో PM10 సగటు 67 µg/m³ ఉండగా, 2026 నాటికి అది 84 µg/m³కు పెరిగింది. PM2.5 స్థాయిలు కూడా 33 శాతం పెరిగి జాతీయ పరిమితులను దాటాయి. ముఖ్యంగా చలికాలంలో కాలుష్యం మరింత తీవ్రంగా నమోదైంది. 2025 డిసెంబర్, 2026 జనవరిలో PM10 స్థాయులు 100 µg/m³ దాటినట్లు అధ్యయనం వెల్లడించింది.

ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా పరిశ్రమల ఉద్గారాలు, పోర్ట్ కార్యకలాపాలు, రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్లు, పెరుగుతున్న వాహన రద్దీని నివేదిక స్పష్టంగా గుర్తించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాల రద్దీతో పాటు పరిశ్రమల దహన ప్రక్రియల ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్లు విశ్లేషణ చెబుతోంది.

ఈ పరిస్థితిని నియంత్రించకపోతే ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారిపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం పరిశ్రమలపై కఠిన నియంత్రణలు, హైపర్‌లోకల్ ఎమిషన్ మ్యాపింగ్, మరిన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు, రియల్‌టైమ్ హాట్‌స్పాట్ రిపోర్టింగ్ వ్యవస్థలను వెంటనే అమలు చేయాలని “రిస్పిరర్ లివింగ్ సైన్సెస్” సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement