భారీ బ్లాస్టింగ్‌తో నష్టపోతున్నాం | Villagers agitation at referendum meeting | Sakshi
Sakshi News home page

భారీ బ్లాస్టింగ్‌తో నష్టపోతున్నాం

Jul 9 2026 5:30 AM | Updated on Jul 9 2026 5:30 AM

Villagers agitation at referendum meeting

ప్రజాభిప్రాయ సేకరణ సభలో గ్రామీణుల ఆందోళన 

సాక్షి, టాస్క్ ఫోర్స్‌ : ‘సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రెండు పంటలు పండే సారవంతమైన 600 ఎకరాల భూములు ఇస్తే పట్టుమని పది ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మేము నివసించే ఇళ్లను ఆనుకుని భారీ బ్లాస్టింగ్‌లు చేస్తే ఇళ్లు బీటలు వారుతున్నాయి. గుండెలు ఝల్లుమంటున్నాయి. ఊరు వదిలిపెట్టి వెళ్లే దుస్థితి దాపురించింది. నల్లమందుతో బ్లాస్టింగ్‌ చేయటం వలన రోగాల బారిన పడుతున్నాం.. మా జీవితాలతో చెలగాటం ఆడుకోవద్దు’ అంటూ  పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు పరిసర గ్రామాల ప్రజలు’ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ ప్రాంతంలో సిమెంట్‌ ఫ్యాక్టరీ విస్తరణ, సున్నపురాయి గని విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ సభను బుధవారం నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నజీనా బేగం అధ్యక్షతన జరిగిన ఈ సభలో  కలెక్టర్‌ కృతికాశుక్లా, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మనందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో దాచేపల్లి మండలం పెదగార్లపాడు, కారంపూడి మండలం కాచవరం, ఇనుపరాజుపల్లి, గాదెవారిపల్లె గ్రామాల ప్రజలు పాల్గొని తమ సమస్యలు ఏకరువు పెట్టారు. 

గతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో పై గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు విస్తరణకు ఎటువంటి అనుమతులూ ఇవ్వొద్దని కలెక్టర్‌ని కోరారు. కొద్దిసేపు సభ వద్ద కాచవరం గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ..కాచవరం గ్రామంలో ఇళ్లని ఆనుకుని జరుగుతున్న మైనింగ్‌ని తక్షణమే నిలిపివేయాలని, ఇళ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా మైనింగ్‌ చేయాలని యాజమాన్య ప్రతినిధులకు సూచించారు. ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మనందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరా­రు. వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ బ్లాస్టింగ్‌ వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement