మీ పత్రిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులతో ఆటలా?

Village Ward Secretariat Employees Association on ABN Andhra Jyothi - Sakshi

ఆంధ్రజ్యోతివి తప్పుడు కథనాలు

‘సచివాలయ’ ఉద్యోగుల్లో ఆందోళన కలిగించేందుకు యత్నం

గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయంగా తమకున్న అక్కసు, కక్షతో ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు సమాచారంతో కథనాలు రాస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం, ఆందోళన కలిగించేందుకు ప్రయత్నిస్తోందని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ తప్పు బట్టింది. సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, అదనపు ప్రధాన కార్యదర్శి బీఆర్‌ఆర్‌ కిషోర్, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విప్పర్తి నిఖిల్‌ కృష్ణలు సోమ వారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

దేశంలో మరే రాష్ట్రంలో లేని సచివాలయ వ్యవస్థను ఈ ప్రభుత్వం మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేసి, నా లుగు నెలల వ్యవధిలోనే ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలిచ్చి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య అపోహలు కలిగించేలా ఆ పత్రిక కథనాలు రాయడాన్ని తాము ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.

అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారిలో అర్హులకు జూన్‌ నెలాఖరుకల్లా ప్రొబేషన్‌ ఖరారు చేసి, జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేయా లని సీఎం జగన్‌ ఈ ఏడాది జనవరిలోనే అధికారులకు ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

ఆ ఆదేశాలకనుగుణంగా గతేడాదిలోనే డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ పాసైన దాదాపు 60 వేల మంది సచివాలయ ఉద్యోగుల వివరాలు ఇప్పటికే అధికారులు తెప్పించుకున్నారని, దీనికి తోడు గత నెలలో డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో పాసైన మరో 12 వేల మంది ఉద్యోగుల వివరాలనూ అధికారులు సేకరిస్తున్నారని అసోసియేషన్‌ నేతలు గుర్తుచేశారు.

ఇంకో 13 వేల మంది ఏఎన్‌ఎంలకు సంబంధించిన ఫలితాలు వెల్లడవడంతో వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు. మరో 14 వేల మహిళా పోలీసులకు సంబంధించిన ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌లో పాస్‌ కాని వారికీ మరోసారి డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించి, వెంటనే ఫలితాలు ప్రకటించి వారికి సైతం ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు ప్రణాళికలు సిద్ధం చేసిన తరుణంలో ఆ పత్రిక యజమాన్యం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగుల జీవితాలతో ఆట లాడుకోవాలనుకోవడం సరికాదని అసోసియేషన్‌ ప్రతినిధులు ఆ ప్రకటనలో హితవుపలికారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top