Vijaya Dairy: పా‘పాల’ పుట్ట!

Vijaya Dairy Chairman Irregularities In Land Purchases - Sakshi

విజయ డెయిరీలో చైర్మన్‌ ఇష్టారాజ్యం 

వీరవల్లి భూముల కొనుగోళ్లలో ‘కోట్లు’ గోల్‌మాల్‌ 

చిత్తూరు, గోదావరి జిల్లాల రైతులకిచ్చే బోనస్‌లో చేతివాటం 

విజయ డెయిరీ.. ఇది ఓ పా‘పాల’ పుట్ట.. అడుగడుగునా అక్రమాల చిట్టా. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ ఇప్పుడు అంతులేని విమర్శలు, వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. టీడీపీ సీనియర్‌ నేత యూనియన్‌ చైర్మన్‌గా కొనసాగుతున్న ఈ సంస్థలో ఇప్పుడు అనేకానేక గోల్‌మాల్‌ వ్యవహారాలు గుప్పుమంటున్నాయి. భూముల కొనుగోలులో చేతివాటం మొదలు రూ.కోట్లలో నిధుల మాయం.. మితిమీరిన కమీషన్ల కక్కుర్తి.. బోనస్‌ల బాగోతం వంటి అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని సంస్థ భాగస్వాములే కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. ఇక పొరుగు రాష్ట్రంలో అయితే ‘విజయ’ ముసుగులో ప్రైవేట్‌ దందాకు తెరతీశారు. మొత్తం మీద విజయ డెయిరీ పరిస్థితి ఇప్పుడు ‘మేడిపండు చూడ మేలిమై యుండు..’ అన్నట్లుగా ఉంది.

సాక్షి, అమరావతి: కృష్ణా మిల్క్‌ యూనియన్‌కి చెందిన విజయ డెయిరీ అంటే ఒక బ్రాండ్‌. సుమారు 600 పాల ఉత్పత్తి సహకార సంఘాలు (సొసైటీలు) దీని కింద ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 40 వేల మంది రైతులున్నారు. ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలను సంస్థ సేకరిస్తుంది. ఇందులో కృష్ణాజిల్లా నుంచే ఎక్కువ పాలు సేకరిస్తారు. దీని వార్షిక టర్నోవర్‌ రూ.900 కోట్లుగా ఉంది. ఇంత ప్రతిష్ట ఉన్న ఈ సంస్థ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్‌. కానీ, ఇప్పుడు ఆ పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీస్తూ కొత్త పాలకవర్గం ఇష్టారాజ్యంగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యతకు పెట్టింది పేరుగా ఉన్న ఈ సంస్థను అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చేశారనే ప్రచారం జరుగుతోంది.

యూనియన్‌ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్‌ నేత చలసాని ఆంజనేయులు బాధ్యతలు చేపట్టాక ఆయన వ్యవహారశైలితో విజయ డెయిరీ బ్రాండ్‌ తన ప్రాభవాన్ని కోల్పోయిందని ఆందులో భాగస్వాములుగా ఉన్న పలు సొసైటీల చైర్మన్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అడుగడుగునా అనేకచోట్ల విజయ పార్లర్లు పెట్టడం ద్వారా సంస్థ ప్రగతిపథంలో ఉందనే భ్రమ బయటకు కల్పిస్తున్నా అంతర్గతంగా మాత్రం పరిస్థితి చేయిదాటిపోయినట్లు స్పష్టమవుతోంది. కొత్త పాలకవర్గం వచ్చిన రెండేళ్లలోనే సంస్థ పరిస్థితి దిగజారిందని, అనేక గోల్‌మాల్‌ వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే మూడు, నాలుగేళ్లలో సంస్థ దివాళా తీయడం ఖాయమని వారు చెబుతున్నారు. 

అక్రమాల చిట్టా ఇదే..
► కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో కొత్త డెయిరీ యూనిట్‌ పెడుతున్నామనే పేరుతో కొనుగోలు చేసిన భూముల్లో పెద్దఎత్తున గోల్‌మాల్‌ జరిగింది. ఇక్కడ తన స్నేహితుడికి చెందిన పొలం ఎకరం రూ.50 లక్షలుంటే రూ.75 లక్షలిచ్చి కొనుగోలు చేశారు. అలాగే, వీరవల్లి పరిసరాల్లోనే రైల్వే ట్రాక్‌కు ఆనుకుని రూ.25 లక్షలున్న ఎకరం భూమిని రూ.50 లక్షలిచ్చి రెట్టింపు రేటుకు కొన్నారు. ఇలా సుమారు 13 ఎకరాలు కొని రూ.4 కోట్లకు పైగా జేబులో వేసుకున్నారు. ఈ భూములను ఎందుకు కొన్నారో ఇప్పటివరకు సొసైటీలకు చెప్పలేదు. మొదట్లో పెల్లెట్స్‌ (గుళికలు) తయారీ ఫ్యాక్టరీ కోసం భూములు కొంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఓ కంపెనీకి రూ.90 కోట్ల వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చి రూ.10 కోట్ల అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. దీనివల్ల సంస్థకు నష్టం తప్ప లాభంలేదని తేలడంతో దాన్ని ఉపసంహరించుకున్నారు. అడ్వాన్స్‌ మొత్తం ఏమైందో సమాధానం చెప్పే దిక్కులేదు.
►  2019లో కొత్త పాలకవర్గం వచ్చే నాటికి సంస్థలో రూ.90 కోట్ల రిజర్వు నిధులున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ఆ డబ్బును రెండేళ్లలోనే కరిగించేశారు. ఆ డబ్బును ఎందుకు, ఎక్కడ ఖర్చు పెట్టారో పాలకవర్గం సర్వసభ్య సమావేశంలో కొందరు అడిగినా ఇప్పటివరకు జవాబులేదు.

బోనస్‌లో ఎలా బరితెగించారంటే.. 
గతంలో రూ.700 కోట్ల వార్షిక టర్నోవర్‌ ఉన్నప్పుడు రైతులకు రూ.65 కోట్ల బోనస్‌ ఇచ్చారు. ఇప్పుడు టర్నోవర్‌ సుమారు రూ.900 కోట్లకు చేరినా రైతులకిచ్చే బోనస్‌ రూ.45 కోట్లకు పడిపోయింది. గతంలో రైతులకు లీటర్‌కు రూ.32 పైసల చొప్పున 3 విడతలుగా బోనస్‌ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.15 పైసలకి తగ్గించి ఒకసారే ఇస్తున్నారు. చైర్మన్‌ దుబారా, ధనదాహమే ఇందుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.     

విజయ పార్లర్లలో ఇతర బ్రాండ్లు
ఇక విజయ పార్లర్లలో ఇతర సంస్థల ఉత్పత్తులను విజయ బ్రాండ్‌ పేరిట విక్రయించడానికి గేట్లు బార్లా తెరిచారు. దీంతో బ్రాండ్‌ పేరు మసకబారింది. కమీషన్ల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి ఐస్‌క్రీం, బ్రెడ్, కేక్, బిస్కెట్లు కొని వాటిని విజయ ఉత్పత్తులుగా అమ్ముతుండడంపై సంస్థలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎలాంటి టెండర్‌ లేకుండా ఒక ఐస్‌క్రీం కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టేశారు. అలాగే, విజయ పాలకు ఉన్నట్లే విజయ పశు దాణాకు మంచి డిమాండ్‌ ఉంది. దాన్ని కూడా స్వయంగా తయారుచేయకుండా కమీషన్ల కోసం ఓ ప్రైవేట్‌ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చేశారు. దీంతో అమ్మకాలు పడిపోయి నష్టాలు వస్తున్నాయి. 

► ఇక చిత్తూరు జిల్లా రైతుల నుంచి సేకరించిన లీటర్‌ పాలకు రూ.3 బోనస్‌ ఇస్తామని చెప్పి రూ.1 మాత్రమే ఇచ్చారు. మిగతా రూ.2 మింగేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇలాగే వెండర్స్‌కి 7.5 శాతం బోనస్‌ ఇస్తామని చెప్పి డబ్బు డ్రా చేసి 3.5 శాతమే ఇచ్చారు. ఇప్పటికీ ఈ రైతులు, వెండర్లు తమ బోనస్‌ కోసం డెయిరీ పెద్దల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. 
► అవసరం లేకపోయినా కమీషన్ల వేటలో భారీగా వెన్న, పాల పొడిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం యూనిట్‌లో వీటి స్టాకు పెద్దఎత్తున నిల్వ ఉంది.  
► తెలంగాణలోని కోదాడ, ఖమ్మంలో విజయ డెయిరీకి గతంలో 16 వేల లీటర్ల మార్కెట్‌ ఉండేది. అది ప్రస్తుతం వెయ్యి లీటర్లకు పడిపోవడం వెనుక చైర్మన్‌ మాయాజాలం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. స్థానికంగా కొందరితో కలిసి అక్కడే పాలు కొని సొంతంగా ప్యాక్‌ చేయించి అమ్ముతున్నట్లు సమాచారం. విజయ బ్రాండ్‌ పేరుతో సొంత లాభం కోసం ఇలా ప్రైవేటు దందాకు తెరతీశారని చెబుతున్నారు.
► తన పబ్లిసిటీ పిచ్చికి తమ చైర్మన్‌ రూ.50 లక్షలు వృధా చేసినట్లు వివిధ సొసైటీల చైర్మన్లు వాపోతున్నారు. యూనియన్‌ చైర్మనే స్వయంగా ఫ్లెక్సీలు వేయించి వాటిని అన్ని సొసైటీలకు లారీలో పంపి కట్టించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top