
‘అపరిష్కార వేదిక’లపై ఆక్రోశం.. నలుగురు ఆత్మహత్యాయత్నం
కూటమి సర్కారులో న్యాయం జరగడం లేదని ఆవేదన
‘అధికార కూటమి నాయకులను ఎదిరించలేం. మాకు జీవనాధారమైన ఇంటి స్థలం... పొలం వదిలి బతకలేం. ఇక మాకు చావే శరణ్యం..’ అంటూ పలువురు పేదలు, రైతులు తమ గోడును అధికారులకు వివరించేందుకు సోమవారం కలెక్టర్, తహశీల్దార్ కార్యాలయాలకు వచ్చి ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టరేట్‌లోనే చచ్చిపోతాం
చిత్తూరు కలెక్టరేట్: ‘మా భూమిని అక్రమంగా ఓ వ్యక్తి అమ్మేశాడు. పొలం వదిలి వెళ్లాలని మా టీడీపీ నాయకులే బెదిరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెండుసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. ఇక మాకు చావే శరణ్యం..’ అంటూ చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం పొట్టగానిపల్లికి చెందిన బాధితుడు వెంకటేష్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ సభ్యత్వ కార్డులు మెడలో వేసుకుని సోమవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద పెట్రోల్ క్యాన్‌తో ఆత్మహత్యాయత్నం చేసింది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. తమకున్న 2.15 ఎకరాల భూమిని మునుస్వామి అనే వ్యక్తి అమ్మేశాడని, పొలం వదిలి వెళ్లాలని కూటమి నేతలతో బెదిరింపులకు గురిచేస్తున్నాడని వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

టీడీపీ నేతల అండతో స్థలం కబ్జా చేస్తున్నారని..
వెదురుకుప్పం: టీడీపీ నేతల అండతో తన ఇంటి స్థలాన్ని ఓ మహిళ ఆక్రమించేందుకు యతి్నస్తున్నారని రమణమ్మ అనే మహిళ సోమవారం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం తహశీల్దార్ కార్యాలయం వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ఇంటి స్థలాన్ని టీడీపీ నేతల అండతో చంద్రమ్మ కబ్జా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తోటి అర్జీదారులు రమణమ్మను తిరుపతి ఆస్పత్రికి తరలించారు. కాగా, చంద్రమ్మ వర్గీయులూ తహశీల్దార్ కార్యాలయం వద్దకు రావడంతో ఇరువర్గాలవారు ఘర్షణ పడ్డారు.

పల్నాడు కలెక్టరేట్‌లో తాపీమేస్త్రి..
నరసరావుపేట: తన 50 గజాల స్థలం వేరే వ్యక్తికి చెందినదని పంచాయతీ సెక్రటరీ సరి్టఫికెట్ ఇచ్చాడని, అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదనే ఆవేదనతో సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో జొన్నగలగడ్డ గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ చుట్టు బ్రహ్మం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యతి్నంచాడు. వెంటనే పోలీసులు అతడ్ని ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ‘నా స్థలాన్ని మరో వ్యక్తికి చెందినదిగా పంచాయతీ కార్యదర్శి సరి్టఫికెట్ ఇచ్చాడు. నేను గతంలో అనేకసార్లు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అధికారులకు అర్జీ అందజేసినా ఫలితం లేదు. అందుకే గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని బ్రహ్మం తెలిపారు. అయితే దీనిని అధికారులు ఖండించారు.

పొలం మధ్యలో రోడ్డు వేశారని...
నంద్యాల: రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని తమ పొలంలో నుంచి రోడ్డు వేశారని ఓ రైతు కుటుంబం నంద్యాల కలెక్టర్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యతి్నంచింది. పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన బాధితులు మధుశేఖర్‌గౌడ్, మద్దిలేటిస్వామి గౌడ్ మాట్లాడుతూ తమ పొలంలో నుంచి కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా అధికారులు లంచాలు తీసుకుని రోడ్డు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కలెక్టర్ రాజకుమారి బాధితుల వద్దకు వచ్చి విషయం తెలుసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.