సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని.. హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ వచ్చానని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని.. 70కి పైగా జర్నలిస్ట్‌లపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.
‘‘మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఐఏఎస్‌లను కూడా రెడ్‌బుక్ వదల్లేదు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనే పోలీసులు దృష్టి పెట్టారు. అందుకే పోలీస్ శాఖ ర్యాంక్ పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించామంటూ నిరసన ర్యాలీ చేస్తే నాపై కేసు పెట్టారు. కట్టుకథలు అల్లీ మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. గుడికి వెళ్లి వస్తుంటే నా మీద దాడి చేసి.. కేసు కట్టారు.
..ప్రతిపక్ష గొంతు వినపడకూడదని కుట్రపన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. మీ అక్రమ కేసులకు మేం భయపడం. మీరు హామీలను నెరవెర్చకుంటే ఆందోళన చేస్తాం. నేను ఎందుకు భయపడాలి?. మీరు నాటిన విష విత్తనం వృక్షమైతే ఎలాంటి పరిస్థితులుంటాయో ఆలోచించుకోండి’’ అంటూ విడదల రజిని వ్యాఖ్యానించారు.


