సెట్‌బ్యాక్‌లు సడలించి మరీ విశాఖలో అదనంగా 2,270.88 చ.మీ. కేటాయింపు
ఇప్పటికే 2016లో మధురవాడ హిల్‌నెంబర్–2లో 7,774.90 చ.మీ. కేటాయింపు
అంతర్జాతీయ క్రిమినల్ కేసులున్న కిలారు సునీల్ డల్లాస్ టెక్నాలజీస్‌లో డైరెక్టర్
చంద్రబాబు సర్కారులో కీలక వ్యక్తి అనుచరుడిగా గుర్తింపు
ఈయన భవనాన్ని టీసీఎస్‌కు లీజుకిస్తూ 2024లో ప్రభుత్వం ఉత్తర్వులు
ఒక క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తికి చెందిన భవనం కేటాయించడంపై అప్పట్లో విమర్శలు
దీంతో టీసీఎస్‌కు ఏపీఐఐసీ మిలీనియం టవర్స్ కేటాయింపు
ఇప్పుడు ఏకంగా 0.56 ఎకరాల భూమిని డల్లాస్ టెక్నాలజీస్‌కు అదనంగా కేటాయిస్తూ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: 2016లో ఆ సంస్థకు భూమి కేటాయించారు.. కార్యకలాపాలు ప్రారంభించడానికి నాలుగుసార్లు అదనపు సమయం ఇచ్చారు.. అయినా ఇంతవరకు ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించలేదు. కానీ, ఈ సంస్థకు ఇప్పుడు కారుచౌకగా, సెట్‌బ్యాక్ నిబంధనలను సడలిస్తూ మరీ అదనపు భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ‘వడ్డించే వాడు మనోడైతే..’ అన్నట్లుగా ప్రభుత్వంలో కీలక వ్యక్తికి చెందిన అనుచరుడి సంస్థ కావడంతో ఈ సంస్థకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఆ సంస్థే డల్లాస్ టెక్నాలజీస్ సెంటర్.
ఇందులో డైరెక్టర్‌గా ఉన్న కిలారు సునీల్ రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న వ్యక్తికి అత్యంత సన్నిహితుడు కావడంతో నిబంధనలను సడలిస్తూ విశాఖ మధురవాడ హిల్‌నెంబర్–2లో కేటాయింపులు మీద కేటాయింపులు చకచకా జరిగిపోతున్నాయి. తొలిసారిగా 2016లో 7,774.90 చ.మీ. స్థలాన్ని పొందిన డల్లాస్ టెక్నాలజీస్.. ఇంతవరకు ఐటీ క్యాంపస్ నిర్మాణం పూర్తిచేయలేకపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు గడువు పొడిగిస్తూ వచ్చారు. ఇలాంటి కంపెనీకి ఇప్పుడు అదనంగా చ.మీ. రూ.10,000 చొప్పున మరో 2,270.88 చ.మీ. భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో అధికారులు విస్తుపోతున్నారు. పైగా.. సెట్‌బ్యాక్ నిబంధనలు కూడా సడలిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఉత్తర్వులు జారీచేశారు.
ఏపీఐఐసీ కాకుండా టీసీఎస్‌కు ‘కిలారు’ సెంటర్..
విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుచేయడానికి ముందుకు రాగానే డల్లాస్ టెక్నాలజీ సెంటర్‌ను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 30, 2024లో ఉత్తర్వులు జారీచేసింది. అప్పటికే ఏపీఐఐసీ మిలీనియం టవర్ పూర్తయి ఖాళీగా ఉన్నా దాన్ని కాదని క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తికి చెందిన కార్యాలయాన్ని టీసీఎస్‌కు కేటాయించడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో టీసీఎస్ వెనక్కి తగ్గడంతో ఏపీఐఐసీ మిలినీయం టవర్‌ను కేటాయించారు.
అమెరికాలో ‘కిలారు’ అకృత్యాలు..
నిజానికి.. కిలారు సునీల్ అమెరికాలో 17 ఏళ్లలోపు చిన్నపిల్లలపై అత్యాచారం చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో టెక్సాస్ కోర్టు అతనికి నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.2.50 లక్షల (3,000 డాలర్లు) జరిమానా విధించింది. అక్కడి నుంచి స్వదేశానికి పారిపోయి వచ్చి న సునీల్ ప్రైమ్‌అజ్ పేరుతో ఐటీ సర్వీసుల రంగంలోకి ప్రవేశించారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందడమే కాకుండా నేరుగా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాల్లో అనేకసార్లు పాల్గొన్నారు.
అయితే, 2015లో కిలారు సునీల్, జనార్థనరావు బొంపాడ, శ్రవణ్య నన్నపనేని, ప్రవీణ్ అట్లూరి, సునీత రుద్రరాజు, వీర్రాజు కాటంరెడ్డి భాగస్వాములుగా ఏర్పాటైన డల్లాస్ టెక్నాలజీ సెంటర్.. ఇలా ఏర్పాటైందో లేదో అలా 2016, సెపె్టంబరు 8న విశాఖపట్నం మధురవాడలోని హిల్ నెంబర్–2లో రూ.కోట్ల విలువైన భూమిని కేటాయించారు. ఇప్పుడు తాజాగా మరో0.56 ఎకరాలు అదనంగా కేటాయిస్తూ ప్రభుత్వం తన ఉదారతను చాటుకుంది.


