గాలివాన బీభత్సం | unseasonal rains also damaged agricultural and horticultural crops: AP | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

May 23 2026 5:29 AM | Updated on May 23 2026 5:29 AM

unseasonal rains also damaged agricultural and horticultural crops: AP

అనంతపురం జిల్లా ఆత్మకూరులో దెబ్బతిన్న అరటి పంటను చూపుతున్న రైతు

పలు జిల్లాల్లో అకాల వర్షం 

ఉద్యాన పంటలకు భారీ నష్టం   

దెబ్బతిన్న అరటి, నిమ్మ, బొప్పాయి, మిరప  

రాలి పడిన మామిడి కాయలు  

నేలకూలిన విద్యుత్‌ స్తంభాలు  

కడప అగ్రికల్చర్‌/కోవెలకుంట్ల(నంద్యాలజిల్లా/బోబ్బిలి/అనంతపురం అగ్రికల్చర్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది.  ఈ అకాల వర్షానికి ఉద్యాన రైతులు నిండా మునిగారు. అరటి, నిమ్మ, బొప్పాయి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తోటల్లో పక్వానికి వచ్చిన మామిడి కాయలు రాలిపోయాయి. ఫలితంగా రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లి, ఎర్రగుంట్ల మండలాల్లో గాలివానకు 665.60 హెక్టార్లలో అరటి, నిమ్మ, బొప్పాయి, మిరప పంటలు దెబ్బతిన్నాయి.

రూ.2.31 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్టు జిల్లా ఉద్యానశాఖ అధికారి సతీష్‌ తెలిపారు.  అన్నమయ్య జిల్లాలో మామిడి, నిమ్మ, మిరప పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. తమలపాకుల తోటలు నేలమట్టమయ్యాయి.   

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలంలో దాదాపు 80 విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగింది. ముదిగేడు గ్రామంలో రైస్‌మిల్లు గోడ కూలి 40 జీవాలు మృతిచెందాయి.   
విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం గాలివానకు విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.   
ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరటి, బొప్పాయి, దానిమ్మ, మామిడి, టమాట పంటలు దెబ్బతిన్నాయి. 25 మండలాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిని రూ.8కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.  అలాగే విద్యుత్‌ సంస్థకు రూ.25 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement