
మహిళతో కానిస్టేబుల్ గొడవను అడ్డుకోబోయిన మరో డ్యూటీ కానిస్టేబుల్
ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య మాటామాటా పెరగడంతో ఘర్షణ
డ్యూటీ కానిస్టేబుల్‌పై మహిళ పిడిగుద్దులు
వీడియో వైరల్ కావడంతో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసిన పోలీస్ కమిషనర్
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్)/లబ్బీపేట (విజయవాడ తూర్పు) : మహిళతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నడిరోడ్డుపై గొడవపడిన ఘటన విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. వీరిని అడ్డుకోబోయిన డ్యూటీ కానిస్టేబుల్‌తో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఘర్షణ పడ్డాడు. అంతేకాక.. డ్యూటీ కానిస్టేబుల్‌పై ఆ మహిళ పిడిగుద్దులు గుద్దింది. దీంతో.. ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు.
వివరాలివీ.. నాలుగో పట్టణ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ నాయక్ సింగ్‌నగర్ డాబాకొట్లు సెంటర్ సమీపంలో ఉంటున్నాడు. మధురానగర్ పసుప తోటకు చెందిన ఓ మహిళతో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో సింగ్‌నగర్‌లో గొడవపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సింగ్‌నగర్ డ్యూటీ కానిస్టేబుల్ కోటేశ్వరరావు వీరిని అడ్డుకుని రోడ్లపై గొడవలేంటని ప్రశ్నించారు.
తామిద్దరం బంధువులమని, తాను ట్రాఫిక్ కానిస్టేబుల్‌నంటూ శ్రీనివాస్ నాయక్ బదులివ్వడంతో అక్కడి నుంచి కోటేశ్వరరావు వెళ్లిపోయాడు. మళ్లీ కాసేపటికి వారిద్దరూ సింగ్‌నగర్ రైతుబజార్ వద్దకు వెళ్లి అదే రీతిలో కొట్టుకుంటుండగా కోటేశ్వరరావు వారిని అడ్డుకునేందుకు యత్నించాడు. దీంతో.. శ్రీనివాస్‌నాయక్, కోటేశ్వరరావు మధ్య మాటామాటా పెరిగింది.
పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ శ్రీనివాస్‌నాయక్‌ను తీసుకొస్తుండగా సదరు మహిళ డ్యూటీలో ఉన్న కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని పిడుగుద్దులు గుద్ది లాక్కెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో విషయం పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు దృష్టికెళ్లింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సీపీ ఎస్వీ రాజశేఖరబాబు సస్పెండ్ చేశారు.