భక్తులకు సౌకర్యాల్లో టీటీడీ భేష్‌ 

TTD Good In facilities for devotees - Sakshi

తిరుమల బాలాజీ కోట్లమంది ఆరాధ్యదైవం 

కరోనా నుంచి త్వరలో విముక్తి కలిగించాలని ప్రార్థించా 

తిరుమలలో లోక్‌సభ స్పీకర్‌ 

కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఓం బిర్లా 

తిరుమల: భక్తులకు సౌకర్యాల కల్పలో టీటీడీ సేవలు భేష్‌ అని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు. ఆయన మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోట్లాదిమంది ఆరాధ్య దైవమైన తిరుమల బాలాజీని ప్రార్థించినట్లు చెప్పారు. కరోనా నుంచి ప్రజలకు త్వరగా విముక్తి కలిగించాలని కోరుకున్నానన్నారు. సమస్యలను సమర్థంగా ఎదుర్కొనే శక్తిని స్వామి ఇస్తారని పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఉభయసభల్లో సభ్యులు తమ పాత్రను సక్రమంగా పోషించేలా స్వామి కరుణ చూపాలని ప్రార్థించినట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంపై తనకు విశ్వాసం ఉందని, పార్లమెంటు ఉభయసభలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయన్న నమ్మకముందని చెప్పారు.

అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్‌కు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్‌ జెట్టి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్పీకర్‌ ధ్వజస్తంభానికి నమస్కరించి తరువాత మూలమూర్తి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా టీటీడీ చైర్మన్, ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్, కాఫీ టేబుల్‌బుక్‌ అందజేశారు. అనంతరం స్పీకర్‌ వసంత మండపంలో జరుగుతున్న సకలకార్యసిద్ధి శ్రీమద్రామాయణ పారాయణంలో పాల్గొన్నారు.

తర్వాత ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠాన్ని సందర్శించిన స్పీకర్‌ దంపతులను వేదపండితులు ఆశీర్వదించగా టీటీడీ చైర్మన్‌ దంపతులు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. తరువాత స్పీకర్‌ తిరుపతిలోని కపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, గురుమూర్తి, భరత్, కలెక్టర్‌ హరినారాయణన్, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు, రిసెప్షన్‌ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.  

వాయులింగేశ్వరుని సేవలో.. 
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుడు, జ్ఞానప్రసూనాంబలను మంగళవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, గురుమూర్తి, మార్గాని భరత్, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఈవో పెద్దిరాజు స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్‌ విలేకరులతో మాట్లాడుతూ కరోనా నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. తహసీల్దారు జరీనా, సీడీపీవో శాంతిదుర్గ, డీఎస్పీ విశ్వనాథ్, బీజేపీ నాయకులు కోలా ఆనంద్, కండ్రిగ ఉమ, సుబ్రహ్మణ్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top